భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు వేదపండితులు చండీహోమం నిర్వహించారు. 80 మంది దంపతులు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్, ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపొలు ఏడుకొండలు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో ఎంతో మేలని, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 13 వాహనాలను బుధవారం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్ వద్ద వీఆర్‌ఏలు బుధవారం సమస్యలపై ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో ప్రభాకరరావుకు వినతిపత్రం అందచేశారు. వీఆర్‌ఏల ధర్నాలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ వీఆర్‌ఏల సమస్యల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తూ ఈనెల 19న చేపట్టిన చలో సీసీఎల్‌ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. వీఆర్‌ఏల అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.జక్కరయ్య, పలువురు వీఆర్‌ఏలు మాట్లాడుతూ వీఆర్‌ఏలు అనేక సమస్యలతో సతమతమవుతూ రెవెన్యూ శాఖకు క్షేత్ర స్థాయిలో సేవలందిస్తున్నారన్నారు. ప్రభుత్వం వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 19న చేపట్టే చలో సీసీఎల్‌ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వీఆర్‌ఏలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
భీమడోలు: శిథిలావస్థలో ఇరిగేషన్ కార్యాలయం శీర్షికన గత నెల 18న సాక్షిలో ప్రచురితమైన కథనానికి గుండుగొలను సెక్షన్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ఎట్టకేలకు ఇరిగేషన్ కార్యాలయానికి మరమ్మతులు చేయాలన్న ఉద్దేశ్యంతో పనులు చేపట్టారు. స్లాబ్ లికేజీ కాకుండా సిమెంట్‌తో నిర్మాణ పనులు చేపట్టారు. గుండుగొలను సెక్షన్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గంథం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు.
బుట్టాయగూడెం: ఐటీడీఏ అధికారుల ప్రమేయం లేకుండానే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వసతిగృహాల్లో కమాటి, కుక్, శానిటేషన్ వర్కర్ల పోస్టులను భర్తీ చేసినట్లు తెలుస్తుంది. సంబంధిత ఐటీడీఏ పరిధిలోని అధికారులకు కూడా కనీస సమాచారం లేకుండా ఏకపక్షంగా అభ్యర్థులను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఎంపిక చేసి నియమించడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.


