కక్షపూరితంగా ఇళ్లు కూలగొట్టారు | - | Sakshi
Sakshi News home page

కక్షపూరితంగా ఇళ్లు కూలగొట్టారు

Aug 13 2026 12:45 AM | Updated on Aug 13 2026 12:45 AM

అయితంపూడి మాజీ సర్పంచ్‌ ఉప్పులూరి లావణ్య

తణుకు అర్బన్‌: ఎమ్మెల్యే రాజకీయ కక్షతోనే తన ఇల్లు కూల్చివేశారని అయితంపూడి మాజీ సర్పంచ్‌ ఉప్పులూరి లావణ్య ఆరోపించారు. తణుకు అర్బన్‌ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల ఆమె మాట్లాడుతూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. గత 15 ఏళ్లుగా సర్పంచ్‌గా సేవలందిస్తూ గ్రామస్థుల అవసరాలు తీర్చామని, జగన్‌ ప్రభుత్వ హయాంలో 80 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. ఆ భూమి కొనుగోళ్లలో రూ. 11 లక్షల సొంత నిధులు కూడా వెచ్చించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే తమపై వేధింపులు మొదలయ్యాయని, ఎమ్మెల్యే తమను రాజకీయ కక్షతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అయితంపూడి మెయిన్‌ రోడ్డు పనులను అడ్డుకోవడంతో పాటు, తమ ఇంటికి స్పీడ్‌ బ్రేకర్లు వేశారని, వాటిని హైకోర్టు ద్వారా తొలగించుకున్నామని చెప్పారు. తీరా ఈనెల 11వ తేదీ తెల్లవారుజామున నోటీసులు ఇవ్వకుండా, 50 ఏళ్లుగా ఉంటున్న తమ ఇల్లు రోడ్డులో ఉందంటూ జేసీబీలతో కూల్చివేశారని వాపోయారు. అదే రోజు ఉదయం కోర్టు నుంచి స్టే ఆర్డర్‌ వచ్చినప్పటికీ, కుట్రపూరితంగా 300 మంది పోలీసులను మోహరించి మరీ ఇల్లు పడగొట్టించారని ఆరోపించారు.

ఎమ్మెల్యే ఆరోపణలు అవాస్తవం

మహిళా సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించిన తనపై ఎమ్మెల్యే అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కోసం ప్రజల నుంచి రూ. 30 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేశారనడంలో ఎలాంటి నిజం లేదని, లబ్ధిదారులు ఈ ఆరోపణను సమర్థిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. ఒకవేళ ఆరోపణలు అవాస్తవమని తేలితే ఎమ్మెల్యే ఏం చేస్తారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అసైన్డ్‌ భూమి ఆక్రమణ ఆరోపణలపై స్పందిస్తూ, అప్పటికే టీడీపీ నాయకుడి పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయి ఉన్న ఆ భూమిని తాము మూడో రిజిస్ట్రేషన్‌ కింద కొనుగోలు చేశామని వివరించారు. పంచాయతీ కార్మికులు, ఇతర అవసరాల నిమిత్తం మంజూరైన సుమారు రూ.7.35 లక్షల వేతనాలు, అభివృద్ధి నిధులను కూడా ఇవ్వొద్దని శాసనసభ్యులే ఆదేశించారని లావణ్య తెలిపారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి స్వయంగా ఈ ఏడాది మార్చి 2వ తేదీన జిల్లా గ్రామ పంచాయతీ అధికారికి రాతపూర్వకంగా తెలిపారని వెల్లడించారు. ఈ సమావేశంలో అయితంపూడి నుంచి వచ్చిన ఇళ్ల స్థలాల లబ్దిదారులు తాము స్థలాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఇరగవరం మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్‌, పార్టీ నాయకులు మేడపాటి దినేష్‌రెడ్డి, లబ్దిదారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement