ధరలు బాగా పెరిగిపోయాయి
ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు
● ఎగబాకుతున్న కూరగాయల ధరలు
● నింగినంటుతున్న నిత్యావసరాల ధరలు
● ఆందోళనలో మధ్య, పేద తరగతి ప్రజలు
సరుకు ఆరు నెలల ప్రస్తుత
క్రితం ధర ధర
(రూ.లలో) (రూ.లలో)
పామాయిల్ 110 135
సన్‌ఫ్లవర్ ఆయిల్ 140 185
వేరుశనగనూనె 150 185
పంచదార 45 53
బెల్లం 45 58
బియ్యం
(25 కిలోలు) 1300–1400 1600–1700
వేరుశనగ గుళ్లు 125 160
కందిపప్పు 110 130
నూజివీడు: నిత్యావసర వస్తువుల ధరలకు తోడు కూరగాయల ధరలు భగ్గుమంటుండటంతో పేద, మధ్య తరగతి ప్రజల బడ్జెట్ తలకిందులవుతోంది. వంటింట్లో ధరల మంట అనేది నేడు సామాన్యుడిని వేధిస్తున్న అతి పెద్ద సమస్యగా తయారైంది. ఏది కొనుగోలు చేయాలన్నా ధరలు షాక్ కొడుతున్నాయి. ముఖ్యంగా నూనెలు, బియ్యం ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. వీటికి తోడు పప్పులు, వేరుశనగ ధరలు కూడా పెరగడంతో సామాన్యులు ఏం కొనాలన్నా కష్టంగా మారింది. పోపు పెట్టాలన్నా, రుచికరంగా కూరలు వండాలన్నా, గారెలు, అట్లు వేసుకోవాలన్నా వంట నూనె ఉండాల్సిందే. ఇప్పుడా వంట నూనె ధరలు సలసలా కాగుతున్నాయి. వీటన్నింటికి తోడు కూరగాయల ధరలు పెరగడంతో ఒక చిన్న కుటుంబం రూ.400 నుంచి రూ.500 వెచ్చిస్తే కానీ వారానికి సరిపడే కూరగాయలు రావడం లేదు. బీర, టమోట, క్యారెట్, మిర్చి, చిక్కుడు తదితర కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. ఆరు నెలల కిందట ఉన్న నిత్యావసర ధరలకు, ప్రస్తుత ధరలకు భారీగా తేడా ఉంది. పెరిగిన ధరలతో సామాన్యుడి వంటగది బడ్జెట్ సైతం పెరిగింది. కనీసం వెయ్యి రూపాయల నుంచి రూ.1500 పెరగడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం గాని, అధికారులు గాని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. కనీసం ఆహార సలహా సంఘాల సమావేశాలను నియోజకవర్గస్థాయి, డివిజన్ స్థాయిల్లో కూడా నిర్వహించడం లేదు. దాదాపు ఈ సమావేశాలను నిర్వహించక రెండేళ్లకు పైగా అయింది.
నిత్యావసర సరుకుల పంపిణీలో కోత
చౌకధరల దుకాణాల్లో గత ప్రభుత్వంలో బియ్యం, పంచదార, కందిపప్పు కార్డుదారులకు ఇచ్చేవారు. పేదల సంక్షేమమే ధ్యేయమని చెప్పే చంద్రబాబు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందించే నిత్యావసర సరుకుల్లో కోత విధించింది. ప్రస్తుత ప్రభుత్వం బియ్యం, అరకేజీ పంచదార మాత్రమే ఇస్తోంది. కందిపప్పును దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి కార్డుదారులకు ఇవ్వకుండా ఎగనామం పెట్టింది. రాగులు, జొన్నలు, గోధుమలు సజ్జలు పంపిణీ చేస్తామని చెప్పి ఇంత వరకు కార్డులకు ఇచ్చిన దాఖలాలే లేవు. ఈ పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సరుకులు కొనుగోలు చేయడం తలకు మించిన భారంగా పరిణమిస్తోంది.
మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. కూలి, నాలీ చేసుకునే వాళ్లం పెరిగిన ధరలతో నిత్యావసర వస్తువులు కొనాలంటే ఇబ్బందిగా ఉంది. వీటికి తోడు కూరగాయల ధరలు సైతం పెరిగాయి. నూనెలు, పప్పులు రేషన్ దుకాణాల్లో ఇస్తే పేదలకు కాస్త ఊరటగా ఉంటుంది.
– చోడగిరి లక్ష్మి, మొర్సపూడి, నూజివీడు మండలం
బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 25 కిలోల బస్తా రూ.1600 నుంచి రూ.1750 వరకు రకాన్ని బట్టి విక్రయిస్తున్నారు. ఇంత ధర పెట్టి పేదలు, మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి రైతుబజారుల్లో బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో బియ్యంను రూ.52కు విక్రయించేలా చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంది.


