ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఉపాధ్యాయులపై టెట్ ఒత్తిడిని తగ్గించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతూ యూటీఎఫ్ నాయకులు బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ. సుభాషిని, ఆర్. రవికుమార్ మాట్లాడుతూ.. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం బాధాకరమన్నారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులందరినీ టెట్ రాయాలనడం అన్యాయమని, ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునిచ్చేలా విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని డిమాండ్ చేశారు. స్పెషల్ టెట్ నిర్వహణలో భాగంగా పాస్ మార్కులు తగ్గించాలని, పరీక్షను ఆఫ్‌లైన్‌లో, సంబంధిత సబ్జెక్టుల్లోనే నిర్వహించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షురాలు ఎస్. సుధారాణి, కోశాధికారి జీవీ రంగమోహన్, కార్యదర్శులు నంబూరి రాంబాబు, కె. కమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


