లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

Aug 13 2026 12:39 AM | Updated on Aug 13 2026 12:39 AM

లారీని ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు 30 మందికి గాయాలు

చింతలపూడి (జంగారెడ్డిగూడెం): జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రహదారి ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తున్న ‘ఇంటర్‌సిటీ స్మార్ట్‌’ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, ముందు వెళ్తున్న ధాన్యం లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి బయలుదేరిన ఈ బస్సు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో పుట్లగట్లగూడెం వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బస్సు లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సీట్లు, బెర్త్‌లలో ఉన్న ప్రయాణికులు కిందపడిపోవడంతో పలువురికి ముఖం, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న లక్కవరం, జంగారెడ్డిగూడెం పోలీసులు, 108 వాహన సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నలిగిపోవడంతో కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ వెంకటేష్‌ను పోలీసులు క్రేన్‌ సహాయంతో బయటకు తీసి, మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం రహదారిపై నిలిచిపోయిన బస్సును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

గాయపడిన వారి వివరాలు

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిలో మల్లిపూడి వెంకట్‌, దాట్ల అన్నపూర్ణదేవి, ఎస్‌. వెంకటరమణ, బహదూర్‌ షరీఫ్‌, వీరమళ్ల వెంకటరమేష్‌, డెండిప్రోలు కుమార్‌ రాజా, పలకూరి వెంకటప్రకాష్‌, ఎన్‌. నాగ (కాకినాడ), ఎండీ సికిందర్‌, బి.నరేష్‌, కె. శ్రీదుర్గ, గుడే లక్ష్మీనారాయణ, టి. సుబ్రహ్మణ్యం (హైదరాబాద్‌), వడిగల ఉమ (జగ్గంపేట), మేడిది మౌనిక (పిఠాపురం), షేక్‌ సజిత్‌, ఊరిగాటి శిరీష, రాయుడు దుర్గాసతీష్‌ (రాజమహేంద్రవరం), యలమర్తి కపిల సాయి, యలమర్తి వెంకటేష్‌ (కాకినాడ) తదితరులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement