చింతలపూడి: తన కుటుంబానికి జీవనాధారమైన మూగజీవి కళ్లెదుటే విద్యుత్ షాక్‌తో గిలగిలలాడుతుంటే ఆ పాడి రైతు తట్టుకోలేకపోయాడు. దాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలనే బలిపెట్టాడు. చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో బుధవారం చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. గ్రామానికి చెందిన రైతు గాలంకి నాగేసు (65) బుధవారం ఉదయం తన పాడి గేదెలను తోలుకుని సమీపంలోని ఆయిల్‌పామ్ తోట గుండా వెళ్తున్నాడు. అక్కడ తెగిపడి ఉన్న 11 కేవీ విద్యుత్ తీగ తగిలి ఓ గేదె విద్యుదాఘాతానికి గురైంది. కళ్లముందే ప్రమాదంలో చిక్కుకున్న ఆ మూగజీవిని రక్షించబోయిన నాగేసు కూడా కరెంట్ షాక్‌కు గురై.. క్షణాల వ్యవధిలోనే గేదెతో పాటే ప్రాణాలు విడిచాడు. పాడి పశువులనే నమ్ముకుని బతుకుతున్న ఇంటి పెద్ద దిక్కు అనంత లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు అక్కడున్న వారి హృదయాలను బరువెక్కించాయి. ఎస్సై కె.సతీష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.
ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీతో కలకలం
ఏలూరు టౌన్: ఏలూరు అశోక్‌నగర్ కేపీడీటీ ఉన్నత పాఠశాల ఎదురు రోడ్లలో మేఘాలు దిగివచ్చాయా అన్నట్లు కనిపించింది. అటువైపుగా వెళ్లే వాహనదారులకు, ఇళ్లలోని జనాలకు కొంతసేపు ఏమీ అర్థం కాలేదు. తెల్లటి పొగమంచు ఆ ప్రాంతాన్ని చుట్టేస్తూ ఉంటే... ఏమి జరుగుతుందో అర్థంకాకపోవటంతో గందరగోళానికి గురయ్యారు. మంటలు లేవు... కానీ తెల్లటి పొగమంచులాంటిది ఆ ప్రాంతాన్ని కమ్మేస్తూ ఉంటే... మబ్బులే రోడ్లపైకి వచ్చేశాయా అనిపించింది. ఇదంతా ఏలూరు అశోక్‌నగర్‌లోని ఆయుష్ హాస్పిటల్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం 4:30 గంటలకు చోటుచేసుకున్న సంఘటన. ఆయుష్ హాస్పిటల్ ఆక్సిజన్ ట్యాంకర్‌ను రీఫిల్ చేస్తుండగా... ప్రమాదవశాత్తు లీకేజీ ఏర్పడింది. భారీఎత్తున ఆక్సిజన్ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. చుట్టుపక్కల రోడ్లన్నీ పొగలా కమ్మేస్తూ ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. అశోక్‌నగర్ కేపీడీటీ స్కూల్ ఎదురు రోడ్డులోని ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏలూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ట్యాంకర్‌కు ఉన్న క్యాప్‌ను మూసివేయటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


