కుక్కునూరు: వృద్ధురాలిపై దాడి చేసి మెడలోని బంగారు నానుతాడును లాక్కెళ్లిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై కె.రాజారెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన 21.600 గ్రాముల (మూడు తులాల) బంగారు నానుతాడుతో పాటు, నేరానికి ఉపయోగించిన మారుతి సుజుకి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న గుండంబోరు గ్రామం వద్ద చర్చి నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న వృద్ధురాలిని కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్డగించి, బెదిరించి దాడి చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారు నానుతాడును లాక్కొని పరారయ్యారు. చోరీ అనంతరం వెంకటాపురం–తిమ్మంపేట రోడ్డు వైపు వెళ్తుండగా అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టి దెబ్బతింది. దీంతో నిందితులు ఆ వాహనాన్ని సమీపంలోని అడవిలో దాచిపెట్టి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బుధవారం ఉదయం వెంకటాపురం–తిమ్మంపేట అడ్డరోడ్డు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు పురుషులు, ఒక మహిళను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారే ఈ చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు.
నిందితులు వీరే..
నిందితుల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన షేక్ ఖాసిం అలియాస్ బాషా (26), వాసంశెట్టి రామచంద్ర పవన్ కుమార్ అలియాస్ స్కైలాబ్ (19), నలుబోలు లోకేష్ (27), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బుట్టా లక్ష్మీపురం గ్రామానికి చెందిన పాయం రూతు (26) ఉన్నారు. నిందితుల్లో ఖాసింపై గతంలో 17, పవన్ కుమార్‌పై 10, లోకేష్‌పై 3 కేసులు (కొన్ని హత్య కేసులు సహా) జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదై ఉన్నాయని ఎస్సై వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ పి.బాల సురేష్ బాబు, ఎస్సై రాజారెడ్డి, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
నలుగురు నిందితుల అరెస్ట్


