కాళ్ల : అక్రమంగా గంజాయి రవాణా చేసి విక్రయాలకు పాల్పడుతున్న తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక కాళ్ల పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆకివీడు రూరల్ సీఐ జి.కాళీచరణ్ వివరాలు వెల్లడించారు. జక్కరం గ్రామానికి చెందిన పంజుల పవన్‌కుమార్ కొద్ది రోజుల క్రితం మారేడుమిల్లి నుంచి 2.250 కిలోల గంజాయిని రూ.9 వేలకు కొనుగోలు చేశాడు. దాన్ని బుధవారం ఉదయం సీసలి గ్రామ శివారులోని డంపింగ్ యార్డు వద్ద మరికొందరితో కలిసి పంచుకుంటుండగా, పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పవన్‌కుమార్‌తో పాటు భీమవరానికి చెందిన ఈద ప్రకాశ్, గొల్లలకోడేరుకు చెందిన పాకర్ల సంజీవ్, నరసింహపురం గ్రామానికి చెందిన కొడమంచిలి మహిమానందం, బొండాడకు చెందిన పిల్లి నాని, బొండాడ పేటకు చెందిన బుంగా బెనర్జీ, కాళ్లకు చెందిన కంభంపాటి సాయి, పెదపుల్లేరుకు చెందిన కనుమూరి దుర్గరామవరప్రసాద్, జువ్వలపాలెంకు చెందిన సండక జశ్వంత్‌లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి నుంచి గంజాయితో పాటు 7 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. నిందితులపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని, కోర్టులో హాజరుపరుస్తామని సీఐ వెల్లడించారు. ఈ సందర్భంగా నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన సీఐ జి.కాళీచరణ్, కాళ్ల ఎస్సై గణేష్‌కుమార్, పోలీసు సిబ్బంది విజయ్, శివ, వాసు, మహేంద్ర, రవికుమార్‌లను ఎస్పీ అద్నాన్ నయీమ్ ఆస్మి, డీఎస్పీ రఘువీర్ విష్ణు అభినందించారు.


