బుట్టాయగూడెం: గుండెపోటుతో మృతి చెందిన పొగాకు రైతు పాలా వెంకటేశ్వరరావు కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీ తరఫున ప్రకటించిన రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చెక్కును సోమవారం రాత్రి బాధిత కుటుంబానికి అందజేశారు. ఇటీవల దేవరపల్లికి వచ్చిన వైఎస్ జగన్‌ను మృతి చెందిన పొగాకు రైతు వెంకటేశ్వరరావు భార్య సీతారత్నం, కుమారుడు శ్రీనివాస్, కుమార్తె సుజాత కలిసి తమ పరిస్థితిని వివరించారు. స్పందించిన వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పి, ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావుల చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం కూడా స్పందించి ఈ రైతు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు, పార్టీ జిల్లా కార్యదర్శులు ఆరేటి సత్యనారాయణ, సయ్యద్ బాజీ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, నాయకులు పంపన నాగబాబు, పంపన కృష్ణ, జిత్తుక సురేష్, మేకరబోయిన శ్రీను, కుక్కల రాంపండు, తదితరులు పాల్గొన్నారు.


