వీరవాసరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రొయ్యల రైతులకు రూ.1.50కే కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు వెంటనే దానిని నెరవేర్చాలని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండలంలోని నవుడూరు జంక్షన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యల రైతులకు ఇచ్చిన హామీల మేరకు రెండున్నరేళ్ల నుంచి ఇవ్వాల్సిన రూ.1.50 సబ్సిడీ నగదును వెంటనే ఆయా రైతులకు జమ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ – 2025 స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని పరీక్ష లీకేజీ, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు.
ఆకివీడు: ఆకివీడు ప్రధాన సెంటర్‌లో జాతీయ రహదారి–165పై గంగానమ్మకోడు మురుగు కాల్వకు ఉన్న కల్వర్టు ఇటీవల ధ్వంసమైంది. దీంతో ప్రమాదభరితంగా మారింది. ఈ నెల 6వ తేదీన ‘ప్రమాదభరితంగా జాతీయ రహదారి కల్వర్టులు’ శీర్షికతో సాక్షిలో వచ్చిన ప్రత్యేక కథనానికి జాతీయ రహదారుల శాఖ అధికారులు స్పందించారు. వెంటనే ధ్వంసమైన కల్వర్టుకు పిట్టగోడ నిర్మాణం చేపట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో కల్వర్టుల గోడలు విరిగి ప్రమాదభరితంగా మారాయి.
భీమవరం: తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయించే బాధితులకు పోలీసు శాఖ వెన్నెముకగా నిలిచి భరోసా కల్పించాలని జిల్లా అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ చెప్పారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయా పోలీసుస్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ ఫిర్యాదులు పునరావృతం కాకుండా సమస్యపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా చూడాలన్నారు. విచారణలో జాప్యంలేకుండా పారదర్శకమైన పద్ధతిలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కెవీవీఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ‘సర్’ ప్రక్రియలో భాగంగా నోటీసులను సంబంధిత ఓటర్లకు త్వరితగతిన జారీ చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో ‘బుక్ ఎ కాల్’తో ప్రజల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ప్రజలకు మరింత చేరువ అవుతుందని కలెక్టర్ అన్నారు. సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం తర్వాత అధికారులతో ఆమె సమీక్షించారు. అనంతరం భీమవరం పీపీ రోడ్డులోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోడౌన్స్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఏలూరు (టూటౌన్): ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఏలూరు నగరంలో క్రైస్తవులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకుండా గత 76 సంవత్సరాలుగా తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఆగస్టు 10న నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏలూరు గ్జేవియర్ నగర్‌లోని అమలోద్బవి కెథడ్రల్ గురువులు, పాస్టర్లు వివిధ మత శాఖలకు చెందిన క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఐసిఎం అగ్ర పీఠాధిపతులు రెవ.జాన్ ఎస్‌డి రాజు ప్రార్థన చేసి ర్యాలీని ప్రారంభించారు. అమలోద్భవి కెథడ్రల్ నుంచి ర్యాలీ ప్రధాన రహదారిలో కలెక్టరేట్‌కు వరకూ సాగింది.


