డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీపై దర్యాప్తు, మంత్రి పదవికి లోకేష్ రాజీనామా కోరుతూ వైఎస్సార్‌సీపీ జిల్లా అంతటా నిర్వహించిన ర్యాలీలకు అనూహ్య స్పందన వచ్చింది. ర్యాలీలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ బలగాలను మోహరించి పోలీసు జులుంతో అడుగడుగునా అడ్డంకులు కల్పించినా పార్టీ శ్రేణులు, ప్రజలు తలొగ్గకుండా ప్రభుత్వంపై పోరుబాట సాగించారు.
సాక్షి, భీమవరం: అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ మండుటెండ, ఉక్కపోతలను లెక్కచేయకుండా పాదయాత్రలు, మెటారు సైకిల్ ర్యాలీలతో హోరెత్తించారు. మెగా డీఎస్సీ–2025 అవినీతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు యువజన ర్యాలీలు, అధికారులకు వినతిపత్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలతో ఉద్యమాన్ని ఉధృతం చేయడం చంద్రబాబు సర్కారును ఇరకాటంలో పడేసింది. సోమవారం శాంతియుత ర్యాలీలను భగ్నం చేసేందుకు పోలీసులను ఉసిగొల్పింది. ఈ క్రమంలో ర్యాలీలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ పోలీసులు ఆటంకాలు కల్పించారు.
● నరసాపురంలో..
నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహణకు ఏర్పాటు చేయగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డున్నారు. శాంతియుతంగా ర్యాలీ జరుగుతుందని చెప్పినా అంగీకరించలేదు. పార్టీ కార్యాలయం నుంచి స్టీమర్ రోడ్డు జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున పార్టీశ్రేణులతో ప్రసాదరాజు పాదయాత్ర చేశారు. లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీజీసీ సభ్యుడు పీడీ రాజు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బర్రే శ్రీవెంకటరమణ, పార్టీ నేతలు బంధన పూర్ణచంద్రరావు, పప్పుల రామారావు, షేక్ బులి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
● ఆచంట నియోజకవర్గంలో..
ఆచంట నియోజకవర్గ కో–ఆర్డినేటర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు నేతృత్వంలో తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయం నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులతో బైక్ ర్యాలీ చేపట్టారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోడేరు తదితర గ్రామాల మీదుగా గోదావరి తీరం వరకు ర్యాలీ సాగింది. దారిపొడవునా పార్టీశ్రేణులు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. పెనుమంట్ర, ఆచంట, పోడూరు, పెనుగొండ మండలాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
● తణుకులో..
తణుకులో మోటారు సైకిల్ ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. రాష్ట్రపతి రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని శిబిరం వద్ద నుంచి నరేంద్ర సెంటర్ వరకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి ఉమాబాల, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. ఎస్‌ఈసీ సభ్యుడు పెండ్ర వీరన్న, నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు వెంకట నాగు, పార్టీ నేతలు వడ్లూరి సీతారాం, వెలగల సాయిబాబారెడ్డి, పొట్ల సురేష్, చోడే గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
● తాడేపల్లిగూడెంలో..
తాడేపల్లిగూడెంలో క్యాంపు కార్యాలయం నుంచి కోఆర్డినేటర్ వడ్డి రఘురాంనాయుడు బైక్ ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వాహనదారుల నుంచి తాళాలు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో రఘురాంనాయుడుకి పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనుమతి కోసం దరఖాస్తు ఇచ్చినా అడ్డుకోవడం సరికాదని, కావాలంటే అరెస్ట్ చేసుకోమని తెగేసిచెప్పారు. భారీ సంఖ్యలో పార్టీశ్రేణులు, యువతతో కలిసి పట్టణంలోని పోలీస్ ఐలాండ్ తదితర ప్రాంతాల మీదుగా పాదయాత్ర చేశారు. అనంతరం మోటారు సైకిల్ ర్యాలీని నిర్వహించారు.
● భీమవరంలో..
భీమవరంలోని పార్టీ అర్బన్ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు ఇంటి సమీపం నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మోటారు సైకిల్ ర్యాలీకి సిద్ధం కాగా పోలీసులు అడ్డుకున్నారు. అందరూ ఒకేసారి పాదయాత్ర చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో బ్యాచ్‌లుగా విడిపోయి ర్యాలీ చేశారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడం కంటే ర్యాలీలో పాల్గొన్న వారి ఫొటోలు, వీడియోలు తీసేందుకే పోలీసులు ప్రాధాన్యమివ్వడం కనిపించింది. రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, పార్టీ నేతలు ఏఎస్ రాజు, మేడిది జాన్సన్, పాలవెల్లి మంగ, చిగురుపాటి సందీప్, గంటా రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
● ఉండిలో..
ఉండిలో నియోజకవర్గ కో–ఆర్డినేటర్ మంతెన యోగీంద్రకుమార్ ఆధ్వర్యంలో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు మీదకు రావద్దంటూ పార్టీ శ్రేణులను సందుల్లోకి గెంటివేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందిు. యోగీంద్రకుమార్‌ను నెట్టుకుంటూ ఒక ఇంటిలోకి తీసుకువెళ్లి బయటకురాకుండా నిర్భంధించారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వచ్చి బస్టాండు సెంటర్ వరకు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంత మంది నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఈసీ సభ్యుడు పాతపాటి శ్రీనివాసరాజు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
● పాలకొల్లులో..
పాలకొల్లులో ర్యాలీకి పోలీసులు ఆంక్షలు పెట్టారు. బైక్ ర్యాలీకి అంగీకరించకపోవడంతో నియోజకవర్గ కోఆర్డినేటర్ గుడాల శ్రీహరిగోపాలరావు పార్టీ శ్రేణులతో కలిసి యడ్ల బజార్ వరకు పాదయాత్ర చేశారు. లోకేష్ రాజీనామా చేయాలంటూ నల్ల బెలూన్లు గాల్లోకి వదిలి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనంద ప్రకాష్‌బాబు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, రాష్ట్ర అంగనన్‌వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు మద్దాల చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
తణుకులో ర్యాలీలో ముదునూరి మురళీకృష్ణంరాజు, గూడూరి ఉమాబాల తదితరులు
ఆచంటలో మోటార్‌సైకిల్ ర్యాలీలో చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు
ఉండిలో వైఎస్సార్‌సీపీ కన్వీనర్ యోగీంద్రబాబును అడ్డుకుంటున్న పోలీసులు
తాడేపల్లిగూడెంలో వడ్డి రఘురాంను చుట్టుముట్టి ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు
పాలకొల్లులో గుడాల గోపీతో మాట్లాడుతున్న పోలీసులు
భీమవరంలో చినమిల్లి వెంకట్రాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలు
అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసుల యత్నం
అనుమతులు లేవంటూ నేతలతో వాగ్వివాదం
బెదిరింపులను ఖాతరు చేయని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు
జిల్లా అంతటా విజయవంతంగా ర్యాలీలు


