భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు అత్యంత బాధ్యతతో పరిశీలించి, వేగవంతంగా, నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం, అలసత్వానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యల తీవ్రత, వాస్తవ పరిస్థితులను తెలుసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. పరిష్కారం అనంతరం సంబంధిత దరఖాస్తుదారుకు సమాచారం అందించడంతో పాటు సమస్య పూర్తిగా పరిష్కారమైందో లేదో కూడా ధ్రువీకరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 190 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్‌లో 37 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
కొన్ని అర్జీలు
● తణుకుకు చెందిన శ్రీదుర్గా చిట్‌ఫండ్స్‌లో చిట్స్ వేస్తే ఆ డబ్బంతా తీసుకుని గోలి శ్రీనివాసరావు పరారయ్యాడని బాధితులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
● అత్తిలి మండలానికి చెందిన పలువురు చేనేత కార్మికులు పీజీఆర్‌ఎస్‌కు వచ్చి తమకు ప్రభుత్వం అందించే చేనేత ఆర్థిక సాయం రూ.25 వేలు అందలేదని ఫిర్యాదు చేశారు.


