ఫ్లెక్సీల తొలగింపులో పక్షపాత వైఖరి | - | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీల తొలగింపులో పక్షపాత వైఖరి

Aug 11 2026 2:06 AM | Updated on Aug 11 2026 2:06 AM

భీమవరం: భీమవరం పట్టణంలో మున్సిపల్‌ అధికారుల పక్షపాత వైఖరిపై వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడుతున్నారు. కూటమి నాయకుల ఫ్లెక్సీలు తొలగించకుండా వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు, వైఎస్సార్‌ విగ్రహం దిమ్మెను మాత్రం తొలగించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రైతులకు భరోసా కల్పించడానికి గత నెల 15న భీమవరం పట్టణానికి వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేశారు. జగన్‌ పర్యటన ముగిసిన మరుసటి రోజునే మున్సిపల్‌ అధికారులు ఆ ఫ్లెక్సీలు, బ్యానర్లను ఆగమేఘాలపై తొలగించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఈనెల 4న కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని అనేక ప్రాంతాల్లో, యనమదుర్రు డ్రెయిన్‌ వంతెన ఇరువైపులా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేశారు. పుట్టినరోజు గడిచి వారం రోజులు కావస్తున్నా ఫ్లెక్సీలు తొలగించలేదని, ఇదేమి పక్షపాతమని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, పట్టణంలోని ప్రకాశం చౌక్‌ సెంటర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ నాయకులు సిమెంట్‌ దిమ్మె నిర్మించగా.. అక్కడ ఎటువంటి విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు లేవంటూ గత నెలలో మున్సిపల్‌ అధికారులు పొక్లెయినర్‌తో తొలగించారు. కానీ, అదే ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున ఆవిష్కరణలు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికై నా మున్సిపల్‌ అధికారులు పక్షపాత వైఖరిని విడనాడి విధులను సక్రమంగా నిర్వహించకపోతే తగిన శాస్తితప్పదని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement