లింగపాలెం: లింగపాలెం మండలంలో పలు ఇరిగేషన్ చెరువులు ఆక్రమణలతో బక్కచిక్కిపోతున్నాయి. మండలంలో సుమారు 96 ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలతో చెరువు గర్భాలు కుచించుకుపోవడంతో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. వీటితో చెరువు ఆయకట్టదారుల పంటలకు నీరు చాలక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షాలకే చెరువులు నిండుతున్నాయని దీంతో సాగు నీరు సమృద్దిగా ఉండటంలేదని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు గర్భాల వైశాల్యం తగ్గిపోవటంతో నీరు త్వరితగతిన అయిపోవటంతో పంటలకు సాగు నీటి కొరత ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. ఈ చెరువు ఆక్రమణలు కారణంగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు పడి రెండు మూడు సార్లు చెరువులు నిండితే గానీ పంటల సాగుకు నీరు సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ ఆక్రమణలు ఇలాగే కొనసాగితే చెరువు గర్భాల వైశాల్యం పూర్తిగా తగ్గి, సాగుకు నీరు నిల్వ ఉండేపరిస్ధితి ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పలువురు అటవీ భూములను ఆక్రమించుకుని సాగుచేస్తున్నారు. ఆక్రమణలు కొందరు అధికారుల కనుసన్నల్లో సాగడంతో ఈ అక్రమాలకు హద్దూ అదుపు లేకుండా పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూబాగోతాలపై సమగ్ర విచారణ జరిపించి అక్రమంగా సాగుచేస్తున్న అటవీ భూములతోపాటు చెరువుల ఆక్రమణదారుల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.


