కుక్కునూరు: కుక్కునూరు మండలంలోని గుండంబోరు వద్ద మహిళ మెడలో బంగారు గొలుసు తెంచుకుని కారులో పారిపోతున్న నలుగురిని తెలంగాణ సరిహద్దులోని గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాధితుల సమాచారం ప్రకారం.. గుండంబోరులో చర్చికి వెళ్ళి తిరిగి వస్తున్న ఒక మహిళను కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు అడ్రస్ అడుగుతున్నట్లు నమ్మించి మాటలు కలిపారు. ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని కారులో పరారయ్యారు. గమనించిన బాధితురాలి బంధువులు వెంటనే వాహనంలో వారిని వెంబడించారు. నిందితుల కారు వేగంగా వెంకటాపురం రహదారి మీదుగా తెలంగాణ సరిహద్దుల్లోకి దూసుకెళ్లింది. ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామానికి చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ఢీకొట్టడంతో కారు ముందు భాగం దెబ్బతిని అక్కడే నిలిచిపోయింది. అనుమానంతో స్థానిక తిమ్మంపేట గ్రామస్తులు కారులోని వారిని అడ్డుకోగా, అప్పటికే వెంబడిస్తూ వచ్చిన బాధితురాలి బంధువులు అక్కడికి చేరుకుని అసలు విషయం తెలిపారు. దీంతో గ్రామస్తులు నలుగురు నిందితులను పట్టుకుని ములకలపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి నిందితులను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం కుక్కునూరు పోలీసులకు అప్పగించారు.


