పాలకొల్లు సెంట్రల్: అందరూ సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనడానికి నిదర్శనం ఆక్వా రైతులందరికీ రాయితీ యూనిట్ ధర నిర్ణయానికి కారణమని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు బోణం చినబాబు అన్నారు. ఆదివారం స్థానిక కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అని ఉండేవన్నారు. ఆక్వా జోన్‌లో ఉన్న రైతులకు మాత్రమే విద్యుత్ సబ్సిడీ వర్తించేదని నేడు నాన్ ఆక్వా జోన్‌లో ఉన్న ఆక్వా రైతులకు కూడా రూ.1.50 విద్యుత్ యూనిట్ ధరను వర్తింప చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. ఈ విజయానికి రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు ఆధ్వర్యంలో చేసిన పోరాట పలితమేనని అన్నారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న పాలకొల్లు రామచంద్రా గార్డెన్స్ వెనుక భాగంలో ఉదయం 10 గంటలకు ఆక్వా రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బుట్టా రామ్‌కుమార్‌లతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పెన్మెత్స సత్యనారాయణ రాజు, సజ్జా బుజ్జి తదితరులు పాల్గొన్నారు.


