బుట్టాయగూడెం: గత నెల 30న ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి పోలవరం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సంచరిస్తూ పశువులను హతమార్చింది. ఆదివారం లంకపాకల సమీపంలోని కాల్వ నుంచి నడుచుకుంటూ పాపికొండల అభయారణ్యంలోకి ప్రవేశించింది. బుట్టాయగూడెం మండలం వీరమద్దిగూడెం మీదుగా ముంజులూరు అటవీప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పాపికొండల అభయారణ్యంలో దట్టమైన అడవిలో ఉండడం వల్ల అటవీశాఖ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. శనివారం గురుగుమిల్లి, గవరంపేటలో మూడు పశువులపై దాడి చేసిన పెద్దపులి శనివారం ఎక్కడా కూడా పశువులపై దాడి చేసిన దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. గిరిజన ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులిని అటవీశాఖ అధికారులు త్వరితగతిన పట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ పెద్దపులి సంచారంతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారన్నారు. అలాగే అనేక పశువులను పులి హతమార్చడంతో తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని అన్నారు. పరిహారం మాట ఎలా ఉన్నా పశువులను కాపాడాలని ప్రజలపై పులి దాడి జరగకముందుగానే పులిని పట్టుకుని జూకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు.


