సుమారు రూ.4.5 కోట్ల కలెక్షన్
● వాడపల్లి ఆలయ సన్నిధిలో అన్నదానానికి రూ.1.5 కోట్ల సామగ్రి
● మూడేళ్ల క్రితమే సిద్ధం చేసిన పశ్చిమ మిల్లర్స్ అసోసియేషన్
● గత సీజన్‌లో మిల్లర్ల నుంచి సుమారు రూ.4.5 కోట్లు వసూలు చేసిన ముఖ్య నేత
● ఇప్పటికీ అసోసియేషన్ గోడౌన్ వద్దే మూలుగుతున్న సామగ్రి
● ఆ సొమ్ములు ఏమైనట్టని రైస్ మిల్లింగ్ వర్గాల్లో చర్చ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: వాడపల్లి వెంకన్న పేరిట అసోసియేషన్ నేత వసూళ్లపై పశ్చిమ రైస్ మిల్లింగ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వెంకన్న సన్నిధిలో అన్నదానం పేరిట క్వింటాల్ ధాన్యానికి రూ.5 చొప్పున గత సీజన్‌లో సుమారు రూ.4.5 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అప్పటికే సమకూర్చిన సామగ్రి ఇప్పటికీ మూలన ఉండగా ఆ సొమ్ములు ఏమాయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రూ.1.50 కోట్ల సామగ్రి
జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు అనుబంధమైన గోదావరి సొసైటీ గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించింది. భీమవరం, తాడేపల్లిగూడెంలోని కిచెన్స్ ద్వారా ఆహార పదార్థాలను పాఠశాలలకు సరఫరా చేసేవారు. ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని విద్యార్థుల కోసం పాలకొల్లులో కిచెన్ నిర్మించాలని 2021–22లో సొసైటీ నిర్ణయించింది. అందుకోసం చైన్నె నుంచి లక్ష మందికి ఏకకాలంలో అన్నం, సాంబారు, కూరలు సిద్ధం చేసేందుకు దాదాపు రూ.1.5 కోట్ల విలువైన బాయిలర్, స్టీమ్డ్ కుకింగ్ వెసల్స్‌ను చైన్నెలో తయారుచేయించి తీసుకువచ్చారు. అవసరమైన షెడ్లు నిర్మాణాలు చేపట్టారు. అప్పటికే ఈ నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్న భోజనం వంటలు చేస్తున్న మహిళలు ఉపాధి కోల్పోతారని భావించి కిచెన్ ఏర్పాటు ఆలోచనను అసోసియేషన్ విరమించుకుంది. ద్వారకాతిరుమల స్వామివారి సన్నిధిలో అన్నదానం నిమిత్తం గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని అసోసియేషన్ సామగ్రిని సమకూర్చింది. అదే మాదిరిగా పాలకొల్లులో కిచెన్ కోసం తె చ్చిన సామగ్రిని వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి భక్తులకు అన్నదానం కోసం దేవస్థానానికి అందించాలని నాడు గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఉన్న చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సొసైటీ చైర్మన్ పెనుమర్తి కృష్ణంరాజు, అసోసియేషన్ సభ్యులు భావించారు. ఈ మేరకు ఆలయ కమిటీతో చర్చించగా డైనింగ్ హాల్ సిద్ధమైన తర్వాత సామగ్రిని తీసుకువెళతామని సభ్యులు చెప్పినట్టు సొసైటీ నేత ఒకరు తెలిపారు. హాల్ సిద్ధం కావడంతో సామగ్రి కోసం ఆలయ ప్రతినిధులు 2024లో అసోసియేషన్ నేతలను కలిశారన్నారు.
స్టీమ్డ్ కుకింగ్ వెసల్స్
వాడపల్లి వెంకన్న భక్తులకు అన్నదానం పేరిట 2024–25 మిల్లింగ్ సీజన్‌కు గాను గతేడాది మార్చిలో టన్ను ధాన్యంపై రూ. 50ల చొప్పున అసోసియేషన్ నేత ఒకరు దాదాపు రూ.4.5 కోట్ల మేర మిల్లర్లు నుంచి వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే వంట సామగ్రి ఇంకా తాడేపల్లిగూడెం రూరల్ పెదతాడేపల్లిలోని రైస్‌మిల్లర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆవరణలో ఉందంటున్నారు. కిచెన్‌లో సామగ్రిని అమర్చడం, డైనింగ్ టేబుల్స్ నిమిత్తం రూ.50 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని, రూ.కోట్లల్లో కలెక్షన్ ఎందుకు చేశారని, ఇప్పటికి సామగ్రి పంపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంకన్న భక్తులకు అన్నదానం కోసమని వసూలు చేసిన సొమ్ములు ఏమైనట్టని మిల్లర్లు చర్చించుకుంటున్నట్టు సమా చారం. కాగా సదరు నేత కూటమికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, అధికారుల అండదండలతో ఇ ష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మిల్లింగ్ వర్గా ల్లో టాక్. ఆయనతో మనకెందుకొచ్చిన గొడవన్నట్టు మిన్నకుండి పోతున్నారంటున్నారు.


