జనసేన కార్యకర్తకు బెదిరింపులు
● అక్రమ తవ్వకాలతో తలకిందులైన రూపం
● నేతల కుయుక్తులతో కాంట్రాక్టర్ జంప్
ద్వారకాతిరుమల: రావుల చెరువు కొందరు టీడీపీ నేతలకు వరంగా మారింది అభివృద్ధి పనుల ముసుగులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో రామన్నగూడెం రావుల చెరువు వివాదాలకు నిలయంగా మారింది. 43.77 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కింద 114.98 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. పూడికతీత, గట్ల పటిష్టీకరణ, లాకుల ఏర్పాటు కోసం మినరల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.94.30 లక్షల నిధులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మంజూరు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా మైనింగ్ నిధులు పొందిన ఏకై క చెరువు ఇది కావడం గమనార్హం.
ఆదాయ వనరుగా మలుచుకున్న నేతలు
నిబంధనల ప్రకారం 3 నుంచి 6 నెలల్లో పూర్తికావాల్సిన ఈ పనులు కొందరు స్థానిక టీడీపీ నేతల దందా వల్ల నిలిచిపోయాయి. అక్రమంగా మట్టిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ఈ దోపిడీపై అధికారులను నిలదీసినప్పటికీ, ఈ దందా ఆగలేదు.
రూ.35 లక్షల నష్టంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్
ఈ ఏడాది మార్చిలో విజయవాడకు చెందిన ఒక కాంట్రాక్టర్ రూ.25 లక్షలకు ఇరిగేషన్ టెండర్ దక్కించుకుని, మైనింగ్ శాఖకు మరో రూ.5 లక్షలు చెల్లించి పనులు ప్రారంభించారు. గతంలో నేతలు టిప్పర్ మట్టిని రూ.3,500కి విక్రయించగా, సదరు కాంట్రాక్టర్ రూ.2,500 చొప్పున 100 టిప్పర్ల మట్టి విక్రయానికి అనుమతి పొందారు. అయితే స్థానిక నేతలు ఆ టిప్పర్లను సూర్యచంద్రరావుపేట చెరువుకు మళ్లించడమే కాకుండా, టిప్పర్ యజమానులను సిండికేట్‌గా మార్చి రూ.1,000కే మట్టి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో దాదాపు రూ.35 లక్షల వరకు నష్టపోయిన కాంట్రాక్టర్, మే నెలాఖరులో పనులను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతం దేవినేనివారిగూడెంకు చెందిన ఓ టీడీపీ నేత తన పేరు మీద ఉన్న అనుమతులతో మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను రామన్నగూడెంకు చెందిన ఒక జనసేన కార్యకర్త ఫొటోలు తీయడంతో వివాదం మరింత తీవ్రమైంది. ఈ విషయం తెలుసుకున్న సదరు టీడీపీ నేత, ఆ కార్యకర్తను తన ఇంటికి పిలిపించి తీవ్రంగా హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.


