బంద్ విజయవంతం
కుక్కునూరు / బుట్టాయగూడెం: జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయ చట్టాన్ని తీసుకురావాలని, 1/70 చట్టాన్ని పరిరక్షించాలని, ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు శనివారం చేపట్టిన రాష్ట్ర మన్యం బంద్ ప్రశాంతంగా జరిగింది. కుక్కునూరు మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ నుంచి పాత బస్టాండ్ వరకు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. బంద్‌కు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు, పెట్రోల్ బంకులను మూసివేశారు. గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల వద్ద కూడా నిరసనలు తెలిపారు ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పిల్లి రామకృష్ణ మాట్లాడుతూ గిరిజనులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. జీవో నెం.3కి ప్రత్యామ్నాయంగా తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేయాలని, 1/70 చట్టం పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రరావు, గిరిజన సంఘం నాయకులు శ్యామల లక్ష్మణరావు, పట్ల లక్ష్మయ్య, కాక ఆనంద్, వర్షా నాగేశ్వరరావు, ఎం. ప్రశాంత్, షేక్ వలీ పాషా తదితరులు పాల్గొన్నారు.
బుట్టాయగూడెంలో చట్టాల అమలు కోసం నినాదాలు
బుట్టాయగూడెంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్‌కు సహకరించారు. స్థానిక బస్‌స్టాండ్ వద్ద గిరిజన సంఘ నాయకులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించి హక్కుల సాధనకు నినాదాలు చేశారు. రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ మంగరాజు, నాయకులు మొడియం నాగమణి, పోలోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జీలుగుమిల్లిలో ప్రధాన రహదారిపై నిరసన
జీలుగుమిల్లి మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ప్రధాన రహదారిపై ఆందోళనకారులు ధర్నా చేపట్టి నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మొడియం నాగమణి, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కారం దారయ్య, నాయకులు కారం భాస్కర్, తెల్లం దుర్గారావు, సీహెచ్ కొండలరావు పాల్గొన్నారు.
వేలేరుపాడు/పోలవరం రూరల్: వేలేరుపాడు మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మన్యం బంద్ విజయవంతమైంది. ఈ మేరకు శనివారం వారు గ్రామంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కారం దారయ్య పిట్టా ప్రసాద్ ధర్ముల రమేష్, పొట్ల మోహన్, గడ్డాల ముత్యాలరావు, బంధం ప్రసాద్, మడకం సునీత పాల్గొన్నారు. అలాగే పోలవంరలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఏటిగట్టు సెంటర్ వరకు గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు, బొరగం భూచందర్రావు, మడివి చలపతిరావు పాల్గొన్నారు.


