కై కలూరు: ఆక్వారంగంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చి సమస్యలను సమిష్టిగా పరిష్కరించేందుకు ఆక్వా ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏపీడబ్ల్యూఏ) కృషి చేస్తోందని సంఘ అధ్యక్షుడు తేతల శ్రీనివాస్, కార్యదర్శి బీవీ సతీష్ కుమార్ తెలిపారు. కై కలూరులోని కంఫర్ట్ ఇన్ హోటల్‌లో శనివారం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూఏ నూతన లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. సంఘ భవిష్యత్ కార్యాచరణ, సభ్యుల సంక్షేమం, ఆక్వారంగాభివృద్ధి, చేపలు–రొయ్యల ధరలు, మేతల వినియోగంపై సమగ్రంగా చర్చించారు. సెప్టెంబర్ 29, 30 తేదీల్లో విజయవాడ నోవటెల్ హోటల్‌లో జరగనున్న రొయ్యల రిటైల్ – 2026 కార్యక్రమం వివరాలను ప్రతినిధులు వెల్లడించారు. బ్లూబెల్ ఆక్వా కంపెనీ అధినేత సీతారామ్ ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఈ సమావేశంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేపట్టారు. ఉమ్మడి జిల్లాల నుంచి దాదాపు 250 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీ సభ్యులు వైవీ రమణ, బీవీ నరసింహారావు, బీహెచ్ సుబ్బరాజు, జీఎన్‌వీడీ ప్రసాద్, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల అధ్యక్షులు ఆర్.సతీష్, ఏ.శ్రీధర్, ప్రతినిధులు జీ.సునీల్‌కుమార్, ఏ.నాగేశ్వరరావు, జీ.నరేష్, బీ.వెంకటరత్నం, పీ.గోవిందరావు, ఆర్.శ్రీనివాసరాజు, ఫిషరీస్ న్యూస్ వ్యవస్థాపకుడు ఇందువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


