తాడేపల్లిగూడెం: విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి సాంకేతిక నిపుణులుగా తయారైనప్పుడే నేర్చుకున్న విద్యకు సార్థకత చేకూరుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కొత్త మధుమూర్తి పేర్కొన్నారు. పెదతాడేపల్లిలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాల 5వ గ్రాడ్యుయేషన్ డే శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని, ఉద్యోగాలు చేసేవారిగా కాకుండా నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. అతిథులుగా హాజరైన ఏఎస్‌ఎం టెక్నాలజీస్ ఎండీ రబీంద్ర శ్రీకాంతన్, ఈడీ అఖిల్ రబీంద్ర మాట్లాడుతూ పరిశ్రమల్లో సమష్టి కృషి, నైతిక విలువలు కీలకమని తెలిపారు. కళాశాల ఉత్తమ విద్యార్థి రాపర్ల ప్రసన్నకుమార్‌కు బంగారు పతకం, ప్రశంసాపతకం అందించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో పాలకవర్గ అధ్యక్షుడు గ్రంథి సత్యనారాయణ, కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు పాల్గొన్నారు.


