ముదినేపల్లి(కై కలూరు): ద్విచక్రవాహనాన్ని లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన ప్రమాదంలో వెల్డింగ్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ముదినేపల్లి సమీపంలోని బంటుమిల్లి రోడ్డులో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ సత్యనారాయణపురానికి చెందిన షేక్ నాగుర్ వలీ (47) ప్రస్తుతం పెదపారుపూడి మండలం, రావులపాడులో నివాసముంటూ, పూర్ణ థియేటర్ సమీపంలోని ఓ షాప్‌లో గత మూడేళ్లుగా వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. సహచర కార్మికుడు దాసరి భరత్ చంద్రతో కలిసి సింగరాయపాలెంలో పని ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా, కోమర్రు అడ్డరోడ్డు వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న నాగుర్ వలీ కిందపడటంతో లారీ టైర్లు అతని నడుముపై నుంచి వెళ్లాయి. తీవ్రగాయాలపాలైన నాగుర్ వలీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బైక్ నడుపుతున్న భరత్ చంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భరత్ చంద్ర ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


