ఇష్టారాజ్యంగా సిబ్బంది విధులు
వేలేరుపాడు: అధికారుల నిర్లక్ష్యం కారణంగా 13 ఏళ్ల గిరిజన విద్యార్థిని నిండు ప్రాణం బలయ్యింది. తమ బిడ్డ ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సాధించి తమను పోషిస్తుందని ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. కానీ వారి ఒక్కగానొక్క బిడ్డ కలలు, తల్లిదండ్రుల ఆశలు అకాలంగా ఆవిరైపోయాయి. పాఠశాలలో లూజుగా వేలాడుతున్న విద్యుత్ తీగలే యమపాశాలుగా మారి చిన్నారిని బలి తీసుకున్నాయి. మండలంలోని శివకాశీపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాల అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన పరాకాష్టగా నిలిచింది. ఈ పాఠశాలలో 144 మంది విద్యార్థులు, 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. శుక్రవారం విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని కెచ్చెల లక్ష్మీపార్వతి ఘటనలో పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
చిందరవందరగా తీగలు : ఆశ్రమ పాఠశాల భవనాల్లో విద్యుత్ వైర్లు జాయింట్లతో చిందరవందరగా వేలాడుతున్నాయి. విద్యార్థిని దుస్తులు ఆరబెడుతున్న ప్రదేశంలో శాశ్వత విద్యుత్ వైరింగ్ లేదు. అక్కడ సాధారణ వైరుతో లైటు ఏర్పాటు చేసి, ఆ తర్వాత బల్బును తీసేశారు. అయితే, బల్బు తొలగించినా ఆ వైరుకు విద్యుత్ సరఫరా కొనసాగుతూనే ఉంది. పైగా ఆ లైవ్ వైరు లీడ్లు ఇనుప కిటికీకి ఆనుకుని ఉండటంతో విద్యుత్ ప్రసారమై, దానిని తాకిన పార్వతి షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాఠశాలలోని ఏ భవనం చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. నిత్యం కళ్ల ముందే ఇది కనిపిస్తున్నా, సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అందుబాటులో లేని సిబ్బంది
ఆశ్రమ పాఠశాలలో యమపాశాలుగా విద్యుత్ తీగలు
శివకాశీపురంలో విద్యార్థిని దుర్మరణం
ఆ సమయంలో అందుబాటులో లేని సిబ్బంది
చోద్యం చూస్తున్న ఐటీడీఏ అధికారులు
పాఠశాలలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠాలు చెప్పడం మానేసి నిత్యం ఆఫీసు రూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారు. పాఠశాల భవనాల్లో విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో కేఆర్‌పురం ఐటీడీఏ అధికారులు కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
– మచ్చా కన్నయ్య, ఆశ్రమ పాఠశాల చైర్మన్
లక్ష్మీపార్వతీ విద్యుత్ షాక్‌కు గురైన సమయంలో వార్డెన్, హెచ్‌ఎంలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఉదయం 6 గంటలకే విద్యార్థిని మృతిచెందగా, వారు జంగారెడ్డిగూడెం డిపో ఆర్టీసీ బస్సులో ఉదయం 9 గంటలకు పాఠశాలకు చేరుకున్నారు. ఇది వారి విధుల పట్ల ఉన్న బాధ్యతారా హిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది.
నిబంధనలకు నీళ్లు
కేఆర్ పురం ఐటీడీఏ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టారు. గిరిజన బాలికల పాఠశాలల్లో కేవలం మహిళా ఉపాధ్యాయులను మాత్రమే నియమించాలనే నిబంధన ఉన్నా, ఇక్కడ ఓ పురుష ఉపాధ్యాయుడిని నియమించడం అధికారుల నిర్లక్ష్యానికి మరో నిదర్శనం.


