భీమవరం: కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఆక్వా విద్యుత్ సబ్సిడీ అందరికీ దక్కే అవకాశం లేకపోవడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే జోన్ల ప్రమేయం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నాయకులు, రెండేళ్ల తర్వాత నిర్ణయం తీసుకున్నా కొత్తగా విద్యుత్ కనెక్షన్లు పొందినవారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
వైఎస్సార్‌సీపీ హయాంలో లభించిన మద్దతు
గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆక్వా రైతులకు యూనిట్‌ను రూ.1.50లకే అందించారు. దీంతో వేలాది మంది రైతులు మోటార్లు ఏర్పాటు చేసుకుని నిశ్చింతగా సాగు చేశారు. కోవిడ్ సమయంలో రొయ్యల ఎగుమతులు మందగించినప్పుడు ప్రభుత్వం స్పందించి, ప్రాసెసింగ్ ప్లాంట్ల వద్ద అధికారులను నియమించి మద్దతు ధర దక్కేలా చూసింది. మేతల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడంతో రైతులంతా ప్రభుత్వానికి అండగా నిలిచారు.
నెరవేరని హామీలు.. ఉధృతమైన పోరాటం
కూటమి ప్రభుత్వం వచ్చాక సీడ్, ఫీడ్ ధరలు పెరిగి, రొయ్యల ధరలు పడిపోవడంతో రైతులు పోరుబాట పట్టారు. గత నెలలో వైఎస్ జగన్ భీమవరంలో నిర్వహించిన భారీ సభ ద్వారా రైతులకు మద్దతుగా ఉద్యమిస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ అమలుకు ముందుకొచ్చింది.
కొందరికేనా సబ్సిడీ?
జిల్లాలోని 20 మండలాల్లో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా, అందులో 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు ఉనట్లు అంచనా. గతంలో 14,000 కనెక్షన్లకు సబ్సిడీ లభించగా, ప్రస్తుతం కొత్తగా మరొక 2,457 కనెక్షన్లకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అయితే, మరో 3,000 వరకు ఉన్న కొత్త విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీపై స్పష్టత లేదని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో 90వేల ఎకరాల్లో రొయ్యల సాగు
గత ప్రభుత్వంలో 14 వేల విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ
అందరికీ సబ్సిడీ అంటూ కూటమి హామీ
కొత్తగా ఇచ్చేది 2,417 కనెక్షన్లకే..
మరో 3 వేల మందికి మొండిచేయి !


