కామవరంలో పశువులపై పులి దాడి | - | Sakshi
Sakshi News home page

కామవరంలో పశువులపై పులి దాడి

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

కామవరంలో పశువులపై పులి దాడి

బుట్టాయగూడెం: గత 10 రోజులుగా ఏలూరు జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి పోలవరం, గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో పశువులను హతమారుస్తూ అటవీశాఖ అధికారులకు కంటిపై కునుకులేకుండా చేసింది. శుక్రవారం సాయంత్రానికి తెలంగాణ రాష్ట్రం ఆశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల, గోపన్నగూడెం వైపు వెళ్ళినట్లు గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున కామవరంలోని మడివి కృష్ణకు చెందిన ఆవు, గిత్తలపై దాడి చేసి పులి హతమార్చింది. పశువులపై దాడి చేసిన నేపథ్యంలో మళ్లీ వస్తుందనే అనుమానంతో రాత్రి 9 గంటల వరకూ సరిహద్దుల్లోనే జిల్లా అటవీశాఖ అధికారి సందీప్‌రెడ్డి పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. పులి ఏపీ బోర్డర్‌ దాటుతూ తెలంగాణ బోర్డర్‌లోకి వెళ్ళడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. డిసెంబర్‌లో కావిడిగుండ్ల నుంచే ఏపీలోకి ప్రవేశించి బుట్టాయగూడెం మండలంలో పలు పశువులపై దాడి చేసి చంపిన పెద్దపులి మొదటిసారిగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌కెమెరాకు చిక్కింది. మళ్లీ శుక్రవారం అధికారుల డ్రోన్‌ కెమెరాకు పులి ఒక ప్రదేశంలో దాగి ఉన్న దృశ్యం చిక్కింది. ఇటీవల ఏపీ నుంచి తెలంగాణకు వెళ్ళిన పులి మళ్లీ పోలవరంలో ప్రత్యక్షమై గోదావరి ఈదుతూ పోలవరం జిల్లాలోకి వెళ్ళి మళ్లీ ఏలూరు జిల్లాలోని పోలవరం మీదుగా పలు మండలాల్లో సంచరిస్తూ అధికారులను, ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పుడు తెలంగాణలోకి వెళ్ళిన పెద్ద పులి తిరిగి వస్తుందా లేక మొదటిసారిగా వచ్చిన మార్గంలోనే వెళ్తుందా అనే విషయాన్ని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

కామవరం సమీపంలో డ్రోన్‌ కెమెరాకు

చిక్కిన పెద్దపులి

మండలంలోని కామవరం సమీపంలో పెద్దపులి దాడిలో మృతి చెందిన గిత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement