భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలిక కనిపించడం లేదంటూ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రహ్మన్ శుక్రవారం చెప్పారు. పట్టణంలోని శ్రీరామపురం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక గురువారం రాత్రి తల్లితో కలిసి ఇంట్లో నిద్రపోయింది. శుక్రవారం ఉదయం బాలిక కనిపించకపోవడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై చెప్పారు.
భీమడోలు : భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం పట్టాలు దాటుతున్న ఓ గుర్తుతెలియని వృద్ధుడిని రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. ఆకివీడు నుంచి నిడదవోలు వచ్చి, అక్కడ నుంచి భీమడోలు వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 60 ఏళ్లు ఉంటుందని.. షర్టుపై టైలర్ అని రాసి ఉందని చెబుతున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే ఎస్‌ఐ కృపాదానం తెలిపారు. ఆచూకీ తెలిస్తే 944041100 నెంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
చింతలపూడి: జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కె.వి.నాగ ప్రభు కుమార్ శుక్రవారం చింతలపూడి ఎకై ్సజ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులు, కేసు ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఎకై ్సజ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, విధి నిర్వహణపై పలు కీలక సూచనలు జారీ చేశారు. సర్కిల్ పరిధిలో నాటుసారా తయారీ, విక్రయాలు, అక్రమ మద్యం రవాణా, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ పి. అశోక్, ఎస్‌ఐ జె. జగ్గారావు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై ఎస్.రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన గరిమెళ్ళ ధనలక్ష్మికి కృష్ణాజిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెం గ్రామానికి చెందిన సాగర్‌తో 2022వ సంవత్సరంలో వివాహం జరిగింది. కొంతకాలం కాపురం సజావుగా సాగింది. భర్త సాగర్ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, ఇందుకు కుటుంబ సభ్యులు గరిమెళ్ళ రాజయ్య సురేష్, గరిమెళ్ళ సురేష్, గరిమెళ్ళ మాధవ రామారావు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం బాధితురాలు ధనలక్ష్మి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై రవికుమార్ తెలిపారు.


