నరసాపురం రూరల్ : మున్సిపల్ ఉపాధ్యాయులకు నిలిచిపోయిన పీఎఫ్ ఖాతాల నిర్వహణను వెంటనే పునరుద్ధరించాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా పీఎఫ్ ఖాతాలు కేటాయించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎఫ్‌ఏపీటీఓ చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం నరసాపురం పట్టణంలోని మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలను సందర్శించిన ఆయన ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై మాట్లాడారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు బకాయి పడిన వేతనాలను వెంటనే చెల్లించాలని, అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. తల్లికి వందనం పథకం నిధుల నుంచి ఎయిడెడ్ పాఠశాలలకు కేటాయించాల్సిన రూ.2,000ను వెంటనే విడుదల చేయాలన్నారు. జిల్లాల పునర్విభజన వల్ల ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ ఉపాధ్యాయులను అంతర్ యాజమాన్య బదిలీల ద్వారా సొంత జిల్లాలకు పంపాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని, 11వ పీఆర్సీ బకాయిలతో పాటు నిలిచిపోయిన నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ రామచంద్రరావు, రాష్ట్ర మహిళా విభాగ కన్వీనర్ బాలాకుమారి తదితరులు పాల్గొన్నారు.


