టేకూరు గిరిజనుల వెల్లడి
వేలేరుపాడు: పోడు భూముల పట్టాల పేరుతో తాము డబ్బులు వసూలు చేసినట్లు వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని వేలేరుపాడు మండలం టేకూరుకు చెందిన పూరెం రమేష్, కట్కూరు జీసీసీ సేల్స్‌మ్యాన్ పూరెం వెంకటేశ్వర్లు, నూపా శ్రీనివాసరావు, నూపా వెంకటేశ్వర్లు, పూరెం నవీన్ స్పష్టం చేశారు. గురువారం వేలేరుపాడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమపై వచ్చిన ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న తమకు పోడు భూముల వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. టేకూరు గ్రామంలో అసలు 200 ఎకరాల పోడు భూమే లేదని తెలిపారు. ఏ ఆధారాలు లేకుండా గిరిజనుల నుంచి పట్టాల పేరుతో ఎకరానికి రూ.2 లక్షల చొప్పున, మొత్తం రూ.1.20 కోట్లు వసూలు చేశామంటూ కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలు ప్రసారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమన్నారు. తాము ఎవరి వద్ద ఒక్క పైసా కూడా తీసుకోలేదని, వసూలు చేసినట్లు ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని సవాలు చేశారు. తమ ఎదుగుదల ఓర్వలేక, పరువు ప్రతిష్టలను, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తే న్యాయస్థానంలో పరువునష్టం దావాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


