కారుమూరిపై దుష్ప్రచారం తగదు | - | Sakshi
Sakshi News home page

కారుమూరిపై దుష్ప్రచారం తగదు

Aug 7 2026 12:56 AM | Updated on Aug 7 2026 12:56 AM

కారుమూరిపై దుష్ప్రచారం తగదు చెకుముకి సైన్స్‌ సంబరాల పోస్టర్‌ ఆవిష్కరణ ఇద్దరు ఎంఈఓల సస్పెన్షన్‌ టెట్‌ పరీక్షలకు 381 మంది హాజరు రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం అమలుపై సమీక్ష

తణుకు అర్బన్‌: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై కూటమి నాయకులు ఎంత దుష్ప్రచారం చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా భయపడేది లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్‌ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, తణుకు నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు వెంకట నాగు స్పష్టం చేశారు. తణుకులో డీఎస్సీ అవకతవకలపై గురువారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో వారు మాట్లాడారు. ప్రశ్నిస్తున్న గొంతుకలను నొక్కివేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అయినప్పటికీ తాము దేనికీ వెనకంజ వేసేది లేదన్నారు. కూటమి నేతలు పెడుతున్న ఇబ్బందుల కారణంగానే కారుమూరి కుటుంబం కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉందని, రానున్న రోజుల్లో వారు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. తణుకులో కూటమి నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ కార్యక్రమాలను ఆపలేరని, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు భవిష్యత్తులోనూ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని వారు తేల్చిచెప్పారు.

భీమవరం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్‌ సంబరాల పోస్టర్‌ను గురువారం కలెక్టరేట్‌లోని విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఓవీఎస్‌ అనిల్‌కుమార్‌ ఆవిష్కరించారు. చెకుముకి జిల్లా కన్వీనర్‌ రేపాక వెంకన్న బాబు మాట్లాడుతూ చెకుముకి సంబరాలు పాఠశాల స్థాయిలో ఈనెల 27న, మండల స్థాయిలో సెప్టెంబరు 11న, జిల్లా స్థాయిలో సెప్టెంబరు 27న, రాష్ట్ర స్థాయిలో నవంబర్‌ 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లుల శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు చింతపల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: జిల్లాలో పెనుగొండ, తాడేపల్లిగూడెం మండల విద్యాశాఖాధికారులను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్‌ అనిల్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెనుగొండ విద్యాశాఖాధికారి డి.శుభాకరరావు, తాడేపల్లిగూడెం విద్యాశాఖాధికారి వి.హనుమలపై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా వీరిని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు అనిల్‌కుమార్‌ తెలిపారు.

ఫ్యాప్టో హర్షం : అవినీతి వ్యవహారాలు, లంచగొండితనం, కక్ష సాధింపులతో ఉపాధ్యాయులను బెదిరించిన పెనుగొండ, తాడేపల్లిగూడెం మండల విద్యాశాఖ అధికారులను సస్పెండ్‌ చేయడం పట్ల ఫ్యాప్టో గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. రెండు నెలలుగా ఫ్యాప్టో జిల్లా కమిటీ చేసిన ఐక్య ఉద్యమాలు, పోరాటాల ఫలితంగానే ఈ చర్యలు తీసుకున్నారని ఫ్యాప్టో జిల్లా యూనిట్‌ అధ్యక్షుడు పీఎస్‌ విజయరామరాజు, జనరల్‌ సెక్రటరీ జి.ప్రకాశం ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

భీమవరం: జిల్లాలో గురువారం జరిగిన టెట్‌ పరీక్షలకు 381 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఓవీఎస్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. పరీక్షకు 415 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 34 మంది గైర్హాజరయ్యారని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లా కలెక్టరేట్‌ ఛాంబర్‌లో గురువారం రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం అమలుపై కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల వయస్సు వరకు ఉన్న వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. స్క్రీనింగ్‌లో ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలిన పిల్లలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లేదా జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రానికి పంపాలని సూచించారు. జిల్లా ఆసుపత్రిలోని బాలల సత్వర చికిత్స కేంద్రం పనితీరు, సిబ్బంది సేవలపై నివేదికలను పరిశీలించి, ప్రజలు ఆ సేవలను పూర్తిగా వినియోగించుకునేలా తగు ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement