భీమవరం: ఆరోగ్యకర సమాజానికి తల్లిపాలే పునాది అని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం భీమవరం పట్టణంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ ప్రైమరీ పాఠశాల అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించడం వల్ల అవి బిడ్డకు మొదటి టీకాగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయన్నారు. శిశువుకు మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. గర్భిణులు, బాలింతలు ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటి పోషకాలు ఉన్నవాటిని తీసుకోవాలని, అంగన్‌వాడీల ద్వారా అందించే సంపూర్ణ పోషణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ పీడీ పి.విజయలక్ష్మి, భీమవరం సీడీపీఓ టీకేవీ లక్ష్మీకాంతం, సూపర్‌వైజర్ డి.అనిల్‌కుమారి తదితరులు పాల్గొన్నారు.


