దీక్షలను విజయవంతం చేయాలి
నేటి నుంచి రిలే దీక్షలు
పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి
● దగాపడ్డ అభ్యర్థులకు అండగా వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు
● నేడు జిల్లా అంతటా నిర్వహణ
● 10న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
సాక్షి, భీమవరం: మెగా డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు అండగా వైఎస్సార్‌సీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. సీబీఐ విచారణ జరిపించి అక్రమాల నిగ్గు తేల్చాలని. అర్హులకు న్యాయం చేయాలని, లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని తదితర డిమాండ్లతో గురువారం నుంచి జిల్లా అంతటా రిలే దీక్షలు నిర్వహించనుంది. 10న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు చేయనున్నారు.
కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసిన టీచర్ల నియామకాల్లో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేపట్టగా, స్పోర్ట్స్ కోటా కింద 421 ఉపాధ్యాయ పోస్టులకు రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాగా ఎంపిక చేశారు. కనీస అర్హతలు లేకున్నా శాప్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి వేలాది మంది అభ్యర్థులు డీఎస్సీకి హాజరయ్యారు. వీరిలో క్వాలిఫై అయిన పలువురు అభ్యర్థులకు కాల్ లెటర్లు సైతం వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నేరవేరిందని సంబరపడేలోపే వారి ఆశలపై చంద్రబాబు సర్కారు నీళ్లు చల్లింది. దేశంలో ఎక్కడాలేని విధంగా మెరిట్ లిస్ట్‌ను మార్చేసింది. అర్హులకు అన్యాయం చేస్తూ మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణకు వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. సర్కారు కుట్రలను ఎండగడుతూ ఆధారాలను సైతం చూపింది. వీటిని పక్కనపెట్టి సవ్యంగా నియామకాలు చేసినట్టు సర్కారు క్లీన్‌చీట్ ఇచ్చుకోవడం విమర్శలకు తావిస్తోంది. డీఎస్సీ–2025లో అక్రమాలు జరగకపోతే సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఒప్పుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. డీఎస్సీపై సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని, అక్రమాలకు నైతిక బాద్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికీ అందని విద్యాకానుక కిట్లు
ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయడం, పాఠశాలలు తెరిచి నెలన్నర రోజులైనా ఇంకా పూర్తిస్థాయిలో విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేయకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం తదితర సమస్యలతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సూపర్స్‌సిక్స్‌లోని నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి హామీని కూటమి ప్రభుత్వం అమలుచేయకపోవడంతో నిరుద్యోగ యువత అవస్థలు పడుతున్నారు.
రౌండ్ టేబుల్ సమావేశాలకు అపూర్వ స్పందన
ఆయా డిమాండ్ల సాధన కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు మేరకు జిల్లా అంతటా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యువజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించడంతో పాటు జిల్లా నాయకత్వం, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సోమ, మంగళవారాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్, టౌన్‌హాల్ సమావేశాలకు అపూర్వ స్పందన వచ్చింది. యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, అభ్యర్థులు హాజరై తమ గళాన్ని వినిపించారు.
భీమవరం: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న డిగ్రీ, పీజీ, ఇంటర్, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ బుధవారం కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. అంబేద్కర్ సెంటర్‌లో జరిగిన నిరసనలో జిల్లా కన్వీనర్ రాయి వెంకట దుర్గా సాయి మాట్లాడుతూ రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రవేశాలు ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారని తెలిపారు. అన్ని కోర్సుల ప్రవేశాలను తక్షణమే పూర్తి చేయడం, విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ ప్రకటించడం, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించడం చేయాలన్నారు. జీవో నంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్ కళాశాలల ఫీజుల దోపిడీని నియంత్రించి, ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కన్వీనర్ శ్యామ్ విజయరాజ్, కార్యదర్శి సాయిరాం, తేజ, ప్రశాంత్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: భీమవరంలో బుధవారం టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఎస్‌ఆర్‌కెఆర్ కళాశాల, డీఎన్నార్ కళాశాలల్లో రెండు షిప్టులుగా పరీక్ష నిర్వహించారు. ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో మొత్తం 450కి 418 మంది అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ అనిల్ కుమార్ తెలిపారు.
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను జిల్లాలో విజయవంతం చేయాలి. గతంలో ఎప్పుడులేని విధంగా మంత్రి లోకేష్ కనుసన్నల్లో డీఎస్సీలో కుంభకోణం జరిగింది. అడ్డగోలుగా స్పోర్ట్స్ కోటా పెట్టి టీడీపీ నాయకులు సిఫార్సు చేసిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టి అర్హులకు అన్యాయం చేశారు. దీనిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు, 10వ తేదిన భారీ ర్యాలీని విజయవంతం చేయాలి.
– ముదునూరి ప్రసాదరాజు,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
డీఎస్సీ అక్రమాలపై విచారణ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగభృతి పథకం అమలు, తదితర డిమాండ్లపై గురువారం నుంచి ఆదివారం వరకు జిల్లా అంతటా నియోజకవర్గాల్లో రిలే నిరాహారదీక్షల నిర్వహణకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ఈమేరకు భీమవరంలోని ప్రకాశంచౌక్ సెంటర్, నరసాపురంలోని అంబేడ్కర్ సెంటర్, ఆచంటలోని కచేరి సెంటర్, తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్, తణుకు రాష్ట్రపతి రోడ్డులోని బాయ్స్ హైస్కూల్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం, పాలకొల్లులోని గాంధీబొమ్మల సెంటర్, ఉండి నియోజకవర్గానికి సంబంధించి కాళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలేదీక్షలు మొదలుకానున్నాయి. సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, నిరుద్యోగులు, అభ్యర్థులు పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు.


