పెదవేగి : కొప్పాకలోని వరి పొలాలు, పీఏసీఎస్‌ను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో పాటు ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్‌తో పంటల ప్రస్తుత పరిస్థితి, సాగు విస్తీర్ణం, పంట ఎదుగుదల దశ, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలు, ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ, అలాగే పీఎంఎఫ్‌బీవై పంట బీమా నమోదు పురోగతి, రైతుల స్పందనపై సమగ్రంగా ఆరా తీశారు. డైరెక్టర్ మాట్లాడుతూ... పీఎంఎఫ్‌బీవై పంట బీమా పథకంలో అర్హులైన ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకొని, గడువులోపు ప్రీమియం చెల్లించి తమ పంటలను ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షించుకోవాలని సూచించారు. రైతులు సహజ వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంబించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, నేల సారాన్ని పెంపొందించి, వాతావరణ మార్పులను తట్టుకునే స్థిరమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితులకు అనుగుణంగా శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, ఏలూరు ఏడీఏ ఈ అనిలకుమారి, డీపీఎం శ్రీ బి.వెంకటేష్, డీఎం (మార్క్‌ఫెడ్) ఎల్‌డీవీ ప్రసాద్ గుప్త, పీఏసీఎస్ చైర్‌పర్సన్ కొసరాజు వీరవెంకట వరప్రసాద్, పీఏసీఎస్ సెక్రటరీ రమేష్, వీరగంటి రాంబాబు, వేగొంట శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌కే సిబ్బంది, ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


