భీమవరం: కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని తిరుపతి ఐఐటీ ఫౌండర్, డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. భీమవరం స్థానిక భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో ఐఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించేందుకు కష్టపడి చదవడంతో పాటు కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధన కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఐఐటీ, ఏఐ విద్యకు సంబంధించిన విద్యార్థుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో భవన్ స్కూల్స్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, భవన్ స్కూల్స్ సెక్రటరీ సామంతపూడి శ్రీరామరాజు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ కొత్త శ్రీమన్నారాయణ శ్రీనివాస్, భవన్ స్కూల్ డైరెక్టర్ మంతెన వెంకట రఘుపతి రాజు, ప్రిన్సిపాల్ గౌరవ్ శర్మ పాల్గొన్నారు.
ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ


