ఏలూరు జీజీహెచ్‌లో అమానుష ఘటన | - | Sakshi
Sakshi News home page

ఏలూరు జీజీహెచ్‌లో అమానుష ఘటన

Aug 6 2026 8:14 AM | Updated on Aug 6 2026 8:14 AM

బాలింతకు హెచ్‌ఐవీ అంటూ వైద్యుల నిర్లక్ష్యం

ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పేదవర్గాల ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదు. అప్పులు చేసి కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లలేని స్థితిలో ఉన్న పేదలు ఏలూరు జీజీహెచ్‌కు వైద్యం కోసం వస్తుంటారు. అయితే, ఇక్కడ గర్భిణులు, బాలింతలు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా మారాయి. రోజుకో సంఘటనతో ఏలూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ వైద్యులు, సిబ్బంది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. తాజాగా, ఒక బాలింతకు రక్త పరీక్షల రిపోర్టులో హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చిందంటూ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులందరినీ పిలిచి అందరి ముందూ అవమానకరంగా మాట్లాడారని బాధితులు చెబుతున్నారు. తీరా బుధవారం అదే బాలింతకు ఏలూరులోని ప్రైవేటు ల్యాబ్‌లో రక్త పరీక్షలు చేయించగా ‘నెగిటివ్‌’ రావడంతో బాధితురాలి భర్త, బంధువులు ఏలూరు జీజీహెచ్‌లో ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అసలేం జరిగిందంటే?

ఏలూరు జిల్లా కై కలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఓ మహిళ ప్రసూతి కోసం ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చేరింది. ఆమె జీజీహెచ్‌లో చేరిన వెంటనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వైద్యులు ఆమెకు రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో బాలింతకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చిందంటూ ఆసుపత్రిలో హడావిడి చేశారు. బాధితులకు కౌన్సిలింగ్‌ ఇవ్వడమో, లేదా గోప్యంగా చెప్పి వైద్య చికిత్స అందించడమో చేయకుండా.. ఆమె బంధువులందరినీ పిలిచి మరీ అవమానకరంగా మాట్లాడటం పట్ల వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్‌ ల్యాబ్‌లో బయటపడిన నిజం

బుధవారం ఏలూరులోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఆమెకు మళ్లీ రక్త పరీక్షలు చేయించగా హెచ్‌ఐవీ ‘నెగిటివ్‌’ వచ్చింది. దీంతో బాధితురాలి బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు జరిగిన అవమానంతో తీవ్ర మానసిక వేదనకు గురై చనిపోదామని నిర్ణయించుకున్నామని, తీరా బయట రక్త పరీక్షలు చేయిస్తే నెగిటివ్‌ వచ్చిందని బాధితులు తెలిపారు. ఏలూరు జీజీహెచ్‌లో వైద్యం సరిగా అందించే పరిస్థితి లేదని, ఇక్కడి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాలింత భర్త కన్నీటిపర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement