నూజివీడు: పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా అది సాధ్యమయ్యేది కాదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నూజివీడులో బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫాపై రాజకీయంగా కక్ష కట్టి కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌ల కింద కేసు పెట్టడం దారుణమన్నారు. ఆయన అందుబాటులో లేకపోతే ఆయన కుమార్తె నూరీ పాతిమా ఇంటితోపాటు ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఏడెనిమిది ఫ్లాట్‌లను రాత్రిపూట తనిఖీ చేయడం దారుణమన్నారు. ఇటీవల ఆలూరులో ఒక మహిళను వేధించినట్లు, చీర చించినట్లు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టారని, తీరా చూస్తే ఆమె భర్తే చించి కేసు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలా లేనిపోని కేసులు నమోదు చేసి వైఎస్సార్‌సీపీ నాయకులను, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను జైల్లో ఉంచాలనే చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ గొంతును నొక్కేయడానికి మాత్రం పోలీసు వ్యవస్థను వాడుతోందన్నారు. పొగాకు రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవరపల్లి వెళ్తే అక్కడ ఒక్క పోలీస్ లేడన్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు వేలాది మంది ప్రజలు వస్తే ప్రభుత్వం సెక్యూరిటీని ఇవ్వకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ నేతల అక్రమ అరెస్టులపై రాబోయే రోజుల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి కార్యాచరణకు దిగుతామన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, గుంటూరు సిటీ అధ్యక్షురాలు నూరీఫాతిమా, తాడికొండ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు, విజయవాడ సిటీ నాయకులు పోతిన మహేష్, గుంటూరు ఏఎంసీ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు.
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు


