● ఎల్‌నినో ప్రభావం నుంచి పంటలను కాపాడుకోవాలి
● వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన
ముసునూరు : రైతన్నలు తమ పంటలను ఎల్‌నినో ప్రభావం నుంచి కాపాడుకోవాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచించారు. మండలంలోని వలసపల్లిలో బుధవారం మండల వ్యవసాయ శాఖాధికారి ఆలూరు చాముండేశ్వరి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ కంబాట్ బృందం, ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పంటల సాగుపై ఎల్ నినో ప్రభావం అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్తలు డా. కె.ఫణికుమార్, డా.ఎన్. నాగేంద్ర బాబు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో ప్రధాన పొలంలో వరి పంట సుడులు తిరిగి ఎండినట్లయితే, పంట తిరిగి కోలుకోవడానికి లీటరు నీటికి 20 గ్రాముల యూరియా కలుపుకొని పిచికారీ చేసుకోవాలని సూచించారు. రసాయనిక ఎరువుల మోతాదును 25 శాతం వరకు తగ్గించుకునేందుకు, జీవన ఎరువులైన అజటోబాక్టర్, అజోస్పిరిల్లమ్‌ను ఎకరాకు 500 గ్రాముల చొప్పున 500 లీటర్ల నీటిలో కలిపి అందించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలుగా మినుములు, పెసలు, కందులు సాగు చేసుకోవాలన్నారు. విత్తనం వేసే ముందు బంకమట్టి, బూడిద నీటిలో కలిపి విత్తన గుళికలు తయారు చేయాలని తెలిపారు. దీనివల్ల మొలక శాతం తగ్గకుండా, పురుగు బారిన పడకుండా, వర్షం పడే వరకు విత్తనాలకు నష్టం వాటిల్లదని వివరించారు. రైతు సమాచార కేంద్రం పొందుపరిచిన యూట్యూబ్ లింక్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని, పంటలకు సంబంధించి రూపొందించిన సాంకేతికతను వీక్షించాలని కోరారు. రైతులు సాగులో ఖర్చు తగ్గించుకుని అదనపు ఆదాయాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ సునీత, రైతు సేవా కేంద్రం, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.


