మోతీనగర్: ఆపదలో ఉన్న సమయంలో సొంత బంధువులు, కుటుంబ సభ్యులు సైతం ఆదుకోవడం అరుదు. అలాంటిది పాతికేళ్ల క్రితం తమతో పాటు కలిసి పనిచేసిన ఒక మిత్రుని బీదరికానికి చలించి ఇల్లు కట్టించి ఇచ్చిన మరో మిత్రుడి ఔదార్యమిది. సుమారు 25 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామానికి చెందిన కేల వెంకట్రావు అలియాస్ సురేష్, మరో నలుగురు మిత్రులు హైదరాబాద్ వచ్చారు. గాయత్రినగర్ డివిజన్ శ్రీ వివేకానందనగర్‌లో నివాసం ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందారు. అందులో వెంకట్రావుతో పాటు వచ్చిన మిగిలిన నలుగురు మిత్రులు ఇక్కడ ఉండలేక తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయారు. అందులో గోవిందు అనే మిత్రుడు ప్రస్తుతం ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడని వెంకట్రావు తెలుసుకున్నారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలున్నారని తెలుసుకుని.. ఆయనకు శాశ్వతంగా నిలిచే సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. వెంకట్రావు తన మిత్రుడు సత్తిబాబు సహకారంతో గోవిందు కోసం స్వగ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం చేపట్టారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా గోవిందుకు తెలియకుండా.. ఆయనతోనే గృహప్రవేశం సైతం చేయించి ఇంటిని అప్పగించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ సంపాదనలో కొంతైనా ఆపదలో ఉన్న వారికి అందించి ఆదుకోవాలన్నారు.


