భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం రాత్రి కొరియన్ కనకరాజు చిత్ర ప్రీ–రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ... గతంలో తన ‘తొలిప్రేమ’ సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్‌ను ఇక్కడే చేశానని, ఆ సినిమా మంచి విజయం సాధించిందని గుర్తుచేసుకున్నారు. కళాశాల సెక్రటరీ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ తన ప్రాణ స్నేహితుడు కావడంతోనే తన తాజా చిత్ర ఈవెంట్‌ను కూడా ఇక్కడే నిర్వహించానని, ఈ సినిమా కూడా గొప్ప విజయం సాధించాలని భీమవరం మావుళ్ళమ్మ సాక్షిగా ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ సుమను వరుణ్ తేజ్ ఘనంగా సత్కరించారు. ఈ చిత్ర యూనిట్‌కు ఏపీఐఐసీ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణమరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి అభినందనలు తెలిపి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.


