పేదింట ధరల మంట | - | Sakshi
Sakshi News home page

పేదింట ధరల మంట

Aug 4 2026 1:59 AM | Updated on Aug 4 2026 1:59 AM

పేదింట ధరల మంట ● జీఎస్‌టీ తగ్గినా ధరలు తగ్గలేదు ఏం కొనే పరిస్థితి లేదు

సమ‘కూర’డం లేదు

సరుకుల మాటేంటి?

కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ శాతాన్ని ఇటీవల తగ్గించినా ఆయా వస్తువుల ధరలు అనుకున్నంత రీతిలో తగ్గలేదు. ధరల తగ్గుదలపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. విజిలెన్స్‌ కమిటీలు, విజిలెన్స్‌ తనిఖీలు కరువయ్యాయి. అధిక ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు. ధరల తగ్గింపునకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేయాలి.

– కె.ప్రసాద్‌, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు, సిద్ధాపురం, ఆకివీడు మండలం

మార్కెట్‌లో ఏమీ కొనే పరిస్థితి కనిపించడం లేదు. పప్పులు, నూనెల ధరలు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్నిరకాల నిత్యావసర సరుకులు తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలి.

– బైనపాలెం మాణిక్యాలదేవి, లక్ష్మణేశ్వరం

సాక్షి, భీమవరం: నిత్యావసర వస్తువుల ధరలు పేదింట మంటలు పుట్టిస్తున్నాయి. పప్పులు ఉడకనంటుంటే.. నూనెలు సలసలమంటున్నాయి. గోదావరికి వరదలతో కూరగాయల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఏమీ కొనేట్టు, తినేట్టుగా లేని పరిస్థితుల్లో పేదవర్గాల వారు సతమతమవుతున్నారు. సర్కారు ధరల నియంత్రణ చర్యలు కేవలం బియ్యానికే పరిమితమం కావడం విమర్శలకు తావిస్తోంది.

ఆకాశంలో ధరలు.. జనం గగ్గోలు

నిత్యావసర సరుకులు లేనిదే రోజు గడవని పరిస్థితి. పశ్చిమాసియా సంక్షోభంతో ఇప్పటికే గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు, కృత్రిమ కొరత తదితర కారణాలతో మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. నాణ్యతను బట్టి కిలో కందిపప్పు రూ.150 వరకు ఉంటే పెసరపప్పు రూ.140, మినపప్పు రూ.130, చాయ మినపగుళ్లు రూ.150, షుగర్‌ రూ.55, పామాయిల్‌ రూ.140, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.180, బియ్యం రూ.70ల వరకు ఉన్నాయి. మసాల దినుసులు, సబ్బులు, టీపొడి తదితర ప్రతి వస్తువు పైనా కొద్దినెలల వ్యవధిలో పది నుంచి 25 శాతం మేర ధరలు పెరిగి పేదలకు భారమవుతున్నాయి. ఇంటిలో పరిస్థితి ఇలా ఉంటే గ్యాస్‌ ధరల పెంపు, సిలెండర్ల కొరతతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బజ్జీల బళ్లు, స్వీట్స్‌ షాపులు, కర్రీ పాయింట్లలో టిఫిన్‌, మీల్స్‌పై ప్లేటుకు రూ.10 నుంచి రూ.30ల వరకు ధరలు పెంచేశారు. జిల్లాలో రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలు 5.68 లక్షలు ఉన్నాయి. అన్నింటా పెరిగిన ధరలతో నెలవారీ బడ్జెట్‌పై రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అదనపు భారం పడుతుండటం వారి జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

బియ్యంతో సరి

మార్కెట్‌లో బియ్యం ధరలు అదుపు చేసేందుకు సివిల్‌ సప్లయిస్‌ శాఖ ఆదివారం ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించింది. స్టీమ్‌ బియ్యం కిలో రూ.52, రా రైస్‌ రూ.50లు చొప్పున రేషన్‌కార్డుపై 10 కిలోలు చొప్పున ఇస్తారని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రత్యేక కౌంటర్లు తెరిచి ఉంటాయని అధికారులు ప్రకటించారు. జిల్లాలో మూడు రైతు బజార్లు, 40 రైస్‌ మిల్లులకు చెందిన ఔట్‌లెట్లలో ఏర్పాటుచేయనున్నట్టు చెప్పగా ఉన్నతస్థాయి నుంచి 33 ఔట్‌లెట్లు ఏర్పాటుకు మాత్రమే అనుమతులు వచ్చినట్టు సమాచారం. సోమవారం నాటికి జిల్లాలో 29 ఔట్‌లెట్లకు సంబంధించిన నిర్వాహకులు మాత్రమే సైట్‌లో లాగిన్‌ అయ్యారు. తాడేపల్లిగూడెం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, నరసాపురం రైతు బజారు, రెండు రైస్‌మిల్లులకు చెందిన ఔట్‌లెట్స్‌ లాగిన్‌ కాలేదు. కాగా జిల్లాలో ఏఏ రైస్‌మిల్లుల వద్ద ఈ కౌంటర్లు ఏర్పాటుచేసింది స్పష్టమైన సమాచారం లేదు. ఎమ్మెల్యేలు అందుబాటులో లేక పలుచోట్ల ఇంకా కేంద్రాలు ప్రారంభించలేదని తెలుస్తోంది.

బె‘ధర’గొడుతున్నాయ్‌

ఉడకని పప్పులు.. సలసలమంటున్న నూనెలు

దుర్భరంగా సామాన్యుల జీవనం

బియ్యానికి మాత్రమే ప్రత్యేక కౌంటర్లు

మిగిలిన నిత్యావసర సరుకుల ఊసెత్తని సర్కారు

గతంలో ఎన్నడూ కూరగాయల ధరలు పెరగడం చూడలేదని, రోజువారీ అమ్మకాలు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే కిలో ఉల్లిపాయలు రూ.35 నుంచి రూ.40ల వరకు ఉండగా, గోదావరికి వరదలతో స్థానికంగా లంక భూముల్లో పండించే వంకాయ, దొండ, బెండ, చిక్కుడు, ఆనబ, క్యాబేజీ, బీరకాయ తదితర కూరగాయల పంటలకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం నిలకడగానే ఉన్నప్పటికి రానున్న రోజుల్లో కూరగాయల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు.

నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ కోసం ఏడాది క్రితం సివిల్‌ సప్లయీస్‌ శాఖ జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర నియోజకవర్గ, మండల కేంద్రాల్లో గల సూపర్‌ మార్కెట్లు, రైతు బజార్లు, ప్రైవేట్‌ దుకాణాల్లో 22 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసింది. హోల్‌సేల్‌ ధరలపై ఉల్లిపాయలు, పామాయిల్‌, బియ్యం తదితర సరుకుల అమ్మకాలు చేపట్టారు. పామాయిల్‌ రూ.110లకు, ఇతర సరుకులను బయటి మార్కెట్‌లో కంటే కొంతమేర తగ్గింపు రేట్లు నిర్ణయించారు. నిర్వహణ సరిగా లేక కొద్దిరోజులకే చాలాచోట్ల ఇవి మూతపడిపోయాయి. ప్రస్తుత పరిస్థితిలో పప్పు దినుసులు, వంట నూనెలు తదితర వాటిని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరలకు విక్రయించాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement