● కూటమి నేతల వ్యూహాలు
● అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు
ఇరగవరం : గ్రామ పంచాయతీల ఖాతాల్లోని నిధులపై కూటమి నేతలు కన్నేశారు. గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిధులను ఏ రకమైన నెపంతోనైనా వెలికితీయాలని కొందరు వ్యూహాలు రచిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల్లోని 912 పంచాయతీల సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో, ప్రస్తుతం నిర్ణయాధికారం ప్రత్యేకాధికారుల చేతికి వచ్చింది. అయినా కూటమి నేతల రాజకీయ జోక్యం తగ్గలేదు. నేరుగా పనులు మంజూరు చేసే అధికారం లేకపోయినా, అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన పనులను ఆమోదింపజేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో కొత్త పనుల అనుమతులు, బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారులు అప్రమత్తంగా, ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
పనులు చేయకుండానే బిల్లులు పొందడానికి..
మండల స్థాయి పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. నాయకులే స్వయంగా పనుల జాబితా తయారు చేసి అధికారులకు అందిస్తున్నారు. పనులు చేయకుండానే బిల్లులు పొందడానికి, లేదా పూర్తయినట్లు చూపించి నిధులు మళ్లించడానికి డ్రెయిన్లు, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్యం వంటి పనుల పేరిట ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఒకే పని కోసం కూటమిలోని నలుగురైదుగురు పోటీ పడుతుండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందే నిధులు కాజేయాలనే నేతల ప్రయత్నాలకు తలొగ్గకుండా నిధులను పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు.


