పశువుల్లో గురక నివారణ ఇలా | - | Sakshi
Sakshi News home page

పశువుల్లో గురక నివారణ ఇలా

Aug 3 2026 4:03 AM | Updated on Aug 3 2026 4:03 AM

చింతలపూడి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పాడి పశువుల పెంపకానికి ప్రసిద్ధి. అనాదిగా పాడి పరిశ్రమను ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పశువులు రకరకాల అంటు రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొత్త నీరు మురుగుతో కలిసి కలుషితం కావడం, ఆ నీటిని పశువులు తాగడం వల్ల అంటు రోగాలు సోకి విలువైన పశు సంపదను కోల్పోయే ముప్పు ఉంటుంది. వర్షాకాలంలో గేదెలు, దూడలకు ఎక్కువగా వచ్చే వ్యాధి గురక.. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైంది. గురక వ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్స, నివారణ చర్యల గురించి పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్‌ కె. లింగయ్య సూచనలు తెలుసుకుందాం.

ఎలా సంక్రమిస్తుంది?

పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ఎడతెరిపి లేని ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా ఇవి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకు ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూడా దోహదపడతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థలు, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్తకణాలను ధ్వంసం చేస్తాయి. రక్తంలో ఆక్సిజన్‌ సరఫరాను దెబ్బతీస్తాయి. దీంతో ప్రాణవాయువు సరిగా అందక పశువులు గురక పెట్టడం, రొప్పడం, ఆయాస పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత తినడం, నెమరు వేయడం ఆగిపోవడం, మెడ, గొంతు వాయడం వంటి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో సరైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణించే ప్రమాదం ఉంది.

గురక వ్యాధికి చికిత్స

వ్యాధిని గుర్తించిన మరుక్షణమే రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును వెంటనే ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. ప్రశాంత వాతావరణంలో పశువులకు పరీక్షలు చేయిస్తే మంచిది. ఈ పరిస్థితుల్లో పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిలిన్‌, క్లాక్సాసిలిన్‌, జెంటామైసిన్‌, సెఫలెక్సిన్‌ వంటి యాంటీబయాటిక్‌ మందులను పశువైద్యుల సూచనల మేరకు అవసరాన్ని బట్టి రక్తంలోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్‌ ఇంజెక్షన్లు, బి–కాంప్లెక్స్‌ ఇంజెక్షన్లు వాడాలి. బాగా నీరసించిన పశువుకై తే డెక్స్‌ట్రోజ్‌ సైలెన్లు ఎక్కించాల్సిన అవసరం కూడా ఉంటుంది.

నివారణ చర్యలు

గురక వ్యాధి సోకిన పశువులకు, రోగ కారకాలైన కలుషిత మేత, నీరు, పరికరాలకు ఇతర పశువులను దూరంగా ఉంచాలి. చనిపోయిన కళేబరాలను లోతుగా గొయ్యి తీసి పూడ్చివేయాలి. పరిసరాల్లో క్రిమికీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డీడీటీ, గమేక్సన్‌, సైపర్‌ మెథ్రిన్‌, కార్బరిల్‌ వంటి క్రిమిసంహారకాలను చల్లి పరిసరాలను క్రిమిరహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి కొత్తగా తెచ్చిన పశువులను కనీసం వారం రోజుల పాటు వేరుగా ఉంచి, వాటికి ఎలాంటి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాకే మిగిలిన పశువులతో కలవనివ్వాలి. గురక వ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తోంది. ప్రస్తుతం గురక వ్యాధి, జబ్బ వాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. పశువైద్యుల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందే వేయిస్తే పశువులను ఈ ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.

డాక్టర్‌ కె. లింగయ్య, పశుసంవర్ధక శాఖ ఏడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement