కొల్లేరులో కానరాని నీరు | - | Sakshi
Sakshi News home page

కొల్లేరులో కానరాని నీరు

Aug 2 2026 1:10 AM | Updated on Aug 2 2026 1:10 AM

కొల్లేరులో కానరాని నీరు ఎల్‌నినో ప్రభావం వల్లే..

నీరు చెరువులకు మళ్లింపు

ఆగస్టు వచ్చినా నిండని కొల్లేరు

ఎగువ నుంచి తగ్గుతున్న నీటి వనరులు

సూపర్‌ ఎల్‌ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తున్నాయి. కొల్లేరుకు ప్రధానంగా డ్రెయిన్లు, కాల్వల నుంచి నీరు చేరుతుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి శాతం తగ్గింది. గోదావరి జలాలను కొల్లేరుకు మళ్లించే అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది.

– ఎం.రామకృష్ణ, ఇరిగేషన్‌ డీఈఈ, కై కలూరు

కై కలూరు: కొల్లేరులో జలకళ కనిపించడం లేదు. సూపర్‌ ఎల్‌ నినో ప్రభావం సరస్సుపై స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఆగస్టు నెలలో కొల్లేరు నీటితో నిండుకుండలా కళకళలాడుతూ, పరివాహక లోతట్టు ప్రాంతాలను ముంపుబారిన పడేసేది. కానీ, ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటికీ కొల్లేరు మధ్యలో పశువులు మేత మేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి కొల్లేరుకు చేరాల్సిన నీటి వనరులు నానాటికీ తగ్గుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నా, పాలకులు మాత్రం కొల్లేరును విస్మరిస్తున్నారు.

కృష్ణా, గోదావరి నదీ డెల్టా ప్రాంతాల మధ్య కొల్లేరు సహజ సిద్ధమైన వరద నివారణ జలాశయంగా ఉంది. సరస్సులోకి ప్రతి ఏటా వర్షాకాలంలో సగటున 65 నుండి 110 టీఎంసీల నీరు చేరుతుంది. వేసవి కాలంలో 135 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యే సరస్సు వైశాల్యం, వర్షాకాలంలో దాదాపు 901 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. సాధారణ రోజుల్లో ఇన్‌ఫ్లో సామర్థ్యం సెకనుకు 90 నుంచి 603 క్యూబిక్‌ మీటర్ల వరకు ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొల్లేరు నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలలో తీవ్ర వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

కొల్లేరులో కరువైన జలకళ

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు విస్తరించి ఉంది. రెండు జిల్లాల్లోని 122 గ్రామాల్లో సుమారు 3.50 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కొల్లేరు సరస్సులోకి ప్రధానంగా 4 సహజ నదులు, వాగులతో పాటు 60కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు నీటి పారుదల కాలువలు, డ్రెయిన్ల ద్వారా వరద నీరు చేరుతుంది. సాధారణంగా ఆగస్టులోనే కొల్లేరు పరవళ్లు తొక్కుతుంది. అలాంటిది, ఇప్పుడు పెదఎడ్లగాడి వద్ద నీటి ప్రవాహం లేక మధ్యలో పశువులు మేత మేస్తున్నాయి. ఈ నీటి కొరత ప్రభావం సహజ జాతి చేపలపై, అభయారణ్యంలో విహరించే పక్షులపై పడుతోంది. ముఖ్యంగా ప్రసిద్ధ ఆటపాక పక్షుల విహార కేంద్రంలోని చెరువులో నీటిని పూర్తి స్థాయిలో నింపకపోవడంతో బోటు షికారు నిలిచిపోయింది.

నిలకడ లేని నీటి వనరులు

కొల్లేరులోకి బుడమేరు నుంచి 30 శాతం, తమ్మిలేరు నుంచి 25 శాతం, రామిలేరు, గుండేరుల నుంచి 20 శాతం వరద నీరు చేరుతుంది. కృష్ణా, గోదావరి డెల్టా కాలువల మిగులు జలాలు, సముద్రపు ఉప్పునీటి పోటు ద్వారా ఏటా దాదాపు 9.6 టీఎంసీల నీరు చేరుతుందని అంచనా. నీటిని చేరవేసే ప్రధాన వనరులను దారి మళ్లించడం వల్ల సరస్సుకు చేరాల్సినంత నీరు రావడం లేదు. గోదావరి నీటిని కొల్లేరుకు మళ్లించాలని ప్రజలు కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు.

ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు లేకపోవడంతో వెలవెలబోతున్న దృశ్యం

మండవల్లి మండలం పెదఎడ్లగాడి ప్రధాన వంతెన వద్ద నీరు లేక పశువులు మేస్తున్న దృశ్యం

కొల్లేరు అభయారణ్యంలో 18,000 ఎకరాల్లో ఆక్రమిత రొయ్యల, చేపల చెరువులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. కొల్లేరుకు వరదల సమయంలో చేరే లక్షా 11 వేల క్యూసెక్కుల నీరు ఉప్పుటేరు ద్వారా దిగువకు వెళ్లాల్సి ఉండగా, కేవలం 12,000 క్యూసెక్కులు మాత్రమే వెళ్తోంది. మిగిలిన నీరు ఆక్రమిత చెరువుల్లోకి చేరుతోంది. అభయారణ్యంలో 5 నుంచి 10 అడుగుల ఎత్తులో చేపల చెరువుల గట్లు ఏర్పాటు చేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకాలు కలుగుతున్నాయి. సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ (సీఈసీ) ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పదేపదే హెచ్చరిస్తున్నా, రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement