చిక్కని పెద్దపులి | - | Sakshi
Sakshi News home page

చిక్కని పెద్దపులి

Aug 2 2026 1:04 AM | Updated on Aug 2 2026 1:04 AM

చిక్కని పెద్దపులి

పులి దాడిలో మృతి

బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు విఫలం

బుట్టాయగూడెం: గత 8 నెలలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి అధికారులు వేసే ఎరకు చిక్కకుండా తప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రామ శివారులో కట్టేసిన పశువులపై తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య పెద్దపులి విరుచుకు పడుతుంది. దాడి చేసి కడుపునిండా తిని రక్తం తాగుతుంది. పగలంతా పులికి అనువైన ప్రదేశాల్లో, పొదల్లో నిద్రపోయి చీకటి పడగానే మళ్లీ వేటకు బయల్దేరుతుంది. పెద్దపులి పేరు వినగానే గ్రామాల్లో ప్రజలు, రైతులు భయపడుతున్నారు.

బుట్టాయగూడెం మండలంలో నాలుగు రోజులుగా మళ్లీ సంచరిస్తున్న పెద్దపులి కండ్రికగూడెం, పండుగూడెం గ్రామాల్లో పశువులపై దాడి చేసింది. శనివారం తెల్లవారుజామున మండలంలోని లక్ష్ముడుగూడెం, కొమ్ముగూడెం సమీపంలో కట్టేసి ఉన్న లేగదూడపై దాడి చేసింది. అక్కడి నుంచి మర్లగూడెం సమీపంలో ఉన్న జామాయిల్‌ తోటలో మకాం వేసింది. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పులి దాక్కున్న ప్రదేశంలోనే పులిని పట్టుకునేందుకు పూణెకు చెందిన ప్రత్యేక నిపుణుల బృందాలు జామాయిల్‌ తోటలో మంచెలు ఏర్పాటు చేసారు. పులికి ఎరను ఏర్పాటు చేశారు. మత్తు ఇచ్చేందుకు గన్‌ను సిద్ధం చేసుకుని సాయంత్రం ఆరున్నర వరకూ సిద్ధంగా ఉన్నారు. పెద్దపులి వారి ఎత్తులకు చిక్కకుండా ఆ ప్రదేశం నుంచి పాటెమ్మ గుడివైపు నడుచుకుంటూ వెళ్ళిపోవడంతో అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. పెద్దపులి కొమ్ముగూడెం, లక్ష్ముడుగూడెం, బూసరాజుపల్లి, పట్టినపాలెం గ్రామాల పరిసర ప్రాంతాల్లో సంచరించడంతో ఆయా పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

బుట్టాయగూడెం మండలంలోని కొమ్ముగూడెం, లక్ష్ముడుగూడెం సమీపంలో కట్టేసిన ఆవు, గేదె దూడపై శనివారం ఉదయం పెద్దపులి దాడి చేసి చంపేసింది. లక్ష్ముడుగూడెం చెందిన నారం నాగేశ్వరరావుకు చెందిన ఆవుపై దాడి చేసి హతమార్చింది. కంగాలవారిగూడెంకు చెందిన మడకం సురేష్‌కి చెందిన లేగదూడపై దాడి చేసింది. పశువులు మృతి చెంది ఉండటంతో ఆందోళన చెంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement