క్వాంటం టెక్నాలజీస్‌ ప్రాజెక్టుపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

క్వాంటం టెక్నాలజీస్‌ ప్రాజెక్టుపై సమీక్ష

Aug 2 2026 1:04 AM | Updated on Aug 2 2026 1:04 AM

క్వాంటం టెక్నాలజీస్‌ ప్రాజెక్టుపై సమీక్ష 6 నుంచి అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీలు

నూజివీడు: జాతీయ క్వాంటం మిషన్‌ కింద నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఏర్పాటు చేసిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ క్వాంటం టెక్నాలజీస్‌ బోధనా ప్రయోగశాల ప్రాజెక్టును సమీక్షించేందుకు భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ఉన్నత స్థాయి బృందం శనివారం ట్రిపుల్‌ఐటీని సందర్శించింది. దీనిలో భాగంగా జాతీయ క్వాంటం మిషన్‌ డైరెక్టర్‌ జే.బి.వి.రెడ్డి, ఏపీ స్టేట్‌ క్వాంటం మిషన్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ సి.వి., టీ హబ్‌ సీఈఓ విజయ్‌ ఏ.రామానుజన్‌లతో పాటు ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ ఆచార్య కొత్తా మధుమూర్తి, ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌ ఆచార్య కె.ఎన్‌.సత్యన్నారాయణలు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన క్వాంటం టెక్నాలజీ పోస్టర్‌ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ పోస్టర్ల ద్వారా విద్యార్థులు తమ సాంకేతిక ఆలోచనలు, పరిశోధనా విధానాలు, భవిష్యత్‌ అనువర్తనాలపై రూపొందించిన ప్రతిపాదనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉన్నత స్థాయి బృందం జాతీయ క్వాంటం మిషన్‌ లక్ష్యాల గురించి వివరించారు. క్వాంటం టెక్నాలజీలో మైనర్‌ డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థులతో ప్రత్యేక ఇంటరాక్టివ్‌ సమావేశం నిర్వహించారు. క్వాంటం హార్డ్‌వేర్‌ ప్లాట్‌ఫారమ్‌లు, క్వాంటం అల్గోరిథంలు, పరిశోధనా అవకాశాలు, ఉన్నత విద్య, అంతర్జాతీయ స్థాయిలో కెరీర్‌ అవకాశాలు వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌, డీన్‌ ఆఫ్‌ అకడమిక్స్‌ దువ్వూరు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈనెల 6వ తేదీ నుంచి జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్‌ షిప్‌ 2026 అంతర్‌ నియోజకవర్గాల క్రీడా పోటీలు, ఎంపికలు నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌.ఏ.అజీజ్‌, సెట్‌వెల్‌ సీఈఓ కె.ఎస్‌.ప్రభాకర రావు, స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ పి.అలివేలు మంగ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని అల్లూరి సీతారామ రాజు స్టేడియంలో ఈ నెల 6 నుంచి 12 క్రీడాంశాలలో ఈ పోటీలు, ఎంపికలు జరుగుతాయన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 6వ తేదీన ఏలూరు అల్లూరి సీతారామ రాజు స్టేడియంలో అండర్‌–17 (బాలురు – బాలికలు), అండర్‌–23 (పురుషులు – మహిళలు) విభాగాలకు ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, బాక్సింగ్‌, హాకీ పోటీలు జరుగుతాయన్నారు. ఏఆర్‌డీజీకే నగరపాలక ఉన్నత పాఠశాలలో చెస్‌ పోటీలు జరుగుతాయని, 6, 7 తేదీల్లో అల్లూరి స్టేడియంలో కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్‌ పోటీలు, ఇండోర్‌ స్టేడియంలో వెయిట్‌ లిఫ్టింగ్‌, యోగా ట్రైనింగ్‌ సెంటర్‌లో యోగా పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement