భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఈనెల 7 వరకు నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్‌లో శనివారం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు అందించడం, మొదటి ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలే ఇవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి వివరించాలని సూచించారు. నవ చేతన అప్లికేషన్ ద్వారా ఆరేళ్లలోపు పిల్లలకు నూరు శాతం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ పి.విజయలక్ష్మి, జిల్లా కో–ఆర్డినేటర్ పి.చంద్రశేఖర్, సీడీపీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
భీమవరం: సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులతో సైన్స్ ప్రాజెక్టులు తయారు చేయించి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని డీఈఓ ఈ. నారాయణ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి నిర్వహిస్తున్న 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోస్టర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు. జిల్లాలోని పాఠశాలల్లో 10 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలో ప్రాజెక్టులు తయారు చేయించాలన్నారు. అప్కాస్ట్ జిల్లా సమన్వయ అధికారి మల్లుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 15లోపు ప్రాజెక్టులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 93942 38826లో సంప్రించాలని కోరారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ పీవీ సత్యనారాయణరాజు, పీఎంఎస్ కో–ఆర్డినేటర్ కె.కృష్ణారావు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో పెంచల ప్రభాకర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జాతీయ స్పూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని, సీటింగ్, వీఐపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, శానిటేషన్, తాగునీటి సరఫరా తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా పర్యవేక్షించాలనిఇ భీమవరం ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సీపీఓ కె.శివపార్వతి, డీఈఓ ఈ.నారాయణ, వ్యవసాయ శాఖ జేడీ వెంకటేశ్వరరావు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: బాలికను సోషల్ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిని ఏలూరు వన్‌టౌన్ సీఐ కె.రామకృష్ణ చాకచక్యంగా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు రూరల్ ప్రాంతానికి చెందిన బాలికకు సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవటంతో ఆమె సోషల్ మీడియా ఖాతాను బ్లాక్‌లో పెట్టింది. దీంతో ద్వేషం పెంచుకున్న సదరు వ్యక్తి సోషల్ మీడియాలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధితురాలు ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై వి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ రామకృష్ణ దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు జిల్లాకు చెందిన పరంపోగు విల్సన్‌బాబు అనే వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని వన్‌టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు.


