వాండ్రంలో బొండాడ డ్రెయిన్ వంతెనపైకి చేరిన నీరు
వాండ్రం పరిధిలో ముంపునకు గురైన వరిచేలు
ఉండి: పనులు సమయానికి పూర్తి కాకపోవడంతో బొండాడ మేజర్ డ్రెయిన్ ఉప్పొంగి, సమీప గ్రామాలు, వరి చేలు ముంపునకు గురవుతున్నాయి. గత వేసవిలో మట్టిమాఫియా వల్ల ఇబ్బందులు రాగా, ప్రస్తుతం కాళ్ల మండలం కోపల్లె హైస్కూల్ వద్ద జువ్వల పాలెం రాష్ట్ర రహదారిపై నిర్మిస్తున్న వంతెన పనుల ఆలస్యమే దీనికి ప్రధాన కారణం. ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పనులను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్న అధికారులు, ఆరు నెలలైనా పూర్తి చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.
ప్రవాహ ఉధృతి పెరిగి.. ఉండి, ఆకివీడు, పాలకోడేరు మండలాల నుంచి వర్షపు నీరు డ్రెయిన్‌లోకి చేరడం, కోపల్లె వద్ద నీటి మళ్లింపు కాలువ వెడల్పు సరిపోకపోవడంతో ప్రవాహ ఉధృతి పెరిగింది. దీని వల్ల ఉండి, ఎన్నార్పీ అగ్రహారం, వాండ్రం గ్రామాల్లోని వరి పొలాలు మునిగిపోయాయి. వాండ్రం నుంచి రామాపురం, పెదపుల్లేరు, చినపుల్లేరు, సీసలి గ్రామా లకు వెళ్లే చిన్న వంతెనపై నుంచి వరద నీరు పారుతుండటంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి.
అధికారుల నిర్లక్ష్యంతోనే..
వాండ్రం గ్రామంలోకి వరద నీరు చేరడమే కాకుండా, మీడియం, మైనర్ డ్రెయిన్లు బిగదన్నడంతో వరి నాట్లు కుళ్లిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పనులు పూర్తయి వంతెన అందుబాటులోకి రావడానికి మరో నెల రోజులు పట్టేలా ఉంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోని అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముంపులోకి వరి చేలు, లోతట్టు ప్రాంతాలు


