డీఆర్వో ప్రభాకర్
భీమవరం (ప్రకాశంచౌక్): ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పుల ప్రక్రియను తప్పులు లేకుండా, వంద శాతం పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.పెంచల్ ప్రభాకర్ సూచించారు. కలెక్టరేట్‌లోని వశిష్ట సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 14,75,036 మంది ఓటర్లలో ఇప్పటికే 13,89,592 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలో 43,746 మంది మరణించినట్లు, 22,131 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు, 15,676 మంది ఇతర చోట్ల నమో దైనట్లు, 3,816 మంది అందుబాటులో లేనట్లు గుర్తించామన్నారు. పెండింగ్‌లో ఉన్న 85,444 ఫారాల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు పార్టీలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం నియోజకవర్గాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు, బూత్ లెవల్ అధికారులతో కలిసి మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఎన్నికల సూపరింటెండెంట్ హెచ్.చంద్రశేఖర్, రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.


