మైలవరం: మార్ఫింగ్ ఫొటోలతో మహిళను వేధిస్తున్న వ్యక్తిని మైలవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ కిశోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పండితవల్లూరు గ్రామానికి చెందిన తోట కృష్ణ మైలవరానికి చెందిన ఓ వివాహితతో ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం పెంచుకుని చాటింగ్ చేస్తున్నాడు. వివాహితను తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని పదేపదే వేధిస్తున్నాడు. వివాహిత అతనికి లొంగకపోవడంతో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నకిలీ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలు సృష్టించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. మార్ఫింగ్ ఫొటోలను మైలవరం ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు పబ్లిక్, సోషల్ మీడియా ఖాతాలు, గ్రూపులకు పంపిస్తూ బాధితురాలిని మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. దీనిపై గత 20 రోజుల క్రితం బాధితురాలు మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గత రెండు రోజులుగా బాధితురాలి కదలికలపై నిఘా ఉంచేందుకు మైలవరం ప్రాంతానికి వచ్చాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మైలవరం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విశ్లేషణ తదితర సాంకేతిక ఆధారాలను వినియోగించి నిందితుడి కదలికలు గుర్తించి అరెస్టు చేసినట్లు సీఐ కిశోర్‌బాబు తెలిపారు. నిందితుడికి సహకరించివారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


