హామీలపై నిలదీస్తే రౌడీషీట్లా..?
నేడు విద్యార్థి, యువజన సంఘాల నిరసన
భీమవరం: కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై ప్రభుత్వం పీడీయాక్ట్, రౌడీషీట్స్ పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం భీమవరంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి.పవన్‌కుమార్ తెలిపారు. గురువారం భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ధర్నా చేసి ముఖ్యమంత్రిని ప్రశ్నించారనే అక్కసుతో విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై రౌడీషీట్ ఓపెన్ చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, జాబ్ క్యా లెండర్ విడుదల చేయకపోవడం, నిరుద్యోగి భృతి ఇవ్వకపోవడం, 20 లక్షల ఉద్యోగావకాశాల కల్పన గురించి ప్రశ్నించినా పట్టించుకోవడం లేదన్నారు. ఇందుకు నిరసనగా శుక్రవారం భీమవరం అంబేడ్కర్ సెంటర్ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ యూత్ జిల్లా అధ్యక్షుడు తమనంపూడి సూర్యవెంకటగణేష్ రెడ్డి, వీరవాసరం యువజన ఉపాధ్యక్షుడు ఎన్.సోమరాజు, ఏఐవైఎఫ్ జిల్లా సహ కార్యదర్శి బొక్కా అవినాష్, జి.సునీల్, జి.వర్మ, కె.జగదీశ్ పాల్గొన్నారు.


